Idream media
Idream media
దేశమంతా నిశ్శబ్దంగా మారిన రోజు.. ఎవరూ అంత నిశ్శబ్దాన్ని అప్పటి వరకూ చూసి ఉండరు. అది కరోనా తెచ్చిన విచిత్రం. కరోనా వారియర్స్‌కు దేశం ఇచ్చిన గౌరవం జనతా కర్ఫ్యూ. గతేడాది ఇదే రోజు మార్చి 22న జనతా కర్ఫ్యూ కొనసాగింది. నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. అనంతరరం తెలంగాణలో మార్చి 23 నుంచి 31 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ రోజు రాష్ట్రంలో కొత్తగా ఐదు పాజిటివ్‌లు నమోదు కావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. సరిహద్దులను కూడా మూసేసి, రాకపోకలను నిషేధించింది. మార్చి 25 నుంచి కేంద్ర ప్రభుత్వమే 23 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌ను విధించింది. అనంతరం రెండో విడతలో ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు(19 రోజులు), మూడో విడతలో మే 4 నుంచి 17 వరకు( 14 రోజులు), చివరిగా మే 18 నుంచి 31 వరకు(14 రోజులు) దాన్ని పొడగిస్తూ వచ్చింది. ఆ తర్వాత జూన్ 1 నుంచి అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించి, దశలవారీగా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
లాభం.. నష్టం..
లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి జరగకుండా, అపారప్రాణనష్టం సంభవించకుండా దేశప్రజలను కాపాడినప్పటికీ, ఆర్థికంగా యావత్ దేశం, ప్రజలు తీవ్రస్థాయిలో దెబ్బతినాల్సివచ్చింది. వైద్యపరమైన మౌలిక సదుపాయాల కల్పనకు లాక్‌డౌన్ అవకాశం కల్పించింది. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో వైరస్ ఆర్‌నాట్ (పునరుత్పత్తి సంఖ్య) 1.7 శాతం ఉంటే, తర్వాత అది 1.2 కు తగ్గింది. అలాగే కేసుల సంఖ్య ప్రతి 4 రోజులకు రెట్టింపు అయితే, ఆ తర్వాత 30 రోజులకు డబ్లింగ్ అయ్యాయి. ఒక రకంగా వ్యాప్తి రేటు తగ్గింది. అలాగే లాక్‌డౌన్ పాక్షికంగా అమలు చేసిన దేశాల్లో 50 రోజుల్లోనే కేసులు పీక్ స్టేజ్‌కు వెళ్లగా, మనదేశంలో 170 రోజులకుగానీ ఆ స్టేజ్‌కు వెళ్లలేదు. ఇతర దేశాల్లో పది లక్షల పాజిటివ్‌లు నమోదు కావడానికి కేవలం 50 రోజులు పడితే మనదగ్గర అది 168 రోజుల సమయం తీసుకుంది. అలాగే సుదీర్ఘ లాక్‌డౌన్ వల్ల కొత్త వేరియంట్స్ రాకుండా ఆగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మళ్లీ పెరుగుతున్న కేసులు
నిరుడు దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ప్రారంభమవ్వగా, నవంబరు నాటికి తీవ్రత తగ్గింది. మళ్లీ ఇప్పుడు వైరస్ విజృంభిస్తోంది. ప్రధానంగా పొరుగున ఉన్న మహారాష్ట్రలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లోకల్ ట్రైన్స్‌తో పాటు, జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది. మన దగ్గర కూడా విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో వైరస్ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది. ప్రజలు సరిగా మాస్కులు ధరించకపోవడం, సమూహాలుగా ఉండటం, టీకా తీసుకునేందుకు సంకోచించడంతో వైరస్ మళ్లీ విజృంభిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఏడాది నాటి పరిస్థితులు కొన్ని రాష్ట్రాలో నెలకొన్నాయి. కొన్నిచోట్ల పూర్థిస్థాయిలో లాక్‌డౌన్ విధిస్తుండగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా కర్ప్యూలాంటి చర్యలకు అయా రాష్ట్ర ప్రభుత్వాలు దిగుతున్నాయి.
మరోసారి లాక్‌డౌన్ వార్తలు
సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో పెరుగుతున్న కేసులే ఈ వార్తలకు కారణం. ప్రధానంగా పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే అధికారిక లెక్కల ప్రకారం 50 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌పై ఆలోచన చేస్తోందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. శని, ఆదివారాలలో లాక్‌డౌన్ విధించడమో, లేదా రాత్రివేళ కర్ఫ్యూ పెట్టే అవకాశాలు ఉంటాయని, దీనిపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ప్రచారం జరుగుతోంది. కాగా, తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ భారీగా కేసులు పెరిగినా, సర్కారుకు లాక్‌డౌన్ విధించాలన్న ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోమని ఆ శాఖ చెబుతోంది.