iDreamPost
android-app
ios-app

సరిగ్గా ఏడాది : రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది ఈరోజే!

సరిగ్గా ఏడాది : రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది ఈరోజే!

అందరినీ వణికించిన కరోనా తొలికేసు తెలంగాణలో నమోదై నేటికి సరిగ్గా ఏడాది. 2020 మార్చి 2న సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది ఈ రోజే. ఇక అక్కడి నుంచి ప్రపంచ మొత్తంతో పాటు తెలంగాణలో కూడా వణుకుపెరిగింది. కరోనా అంటేనే హడలిపోయే పరిస్థితి వచ్చింది. కాలచక్రం గిర్రున తిరిగి ఏడాది గడిచేలోపే ఎన్నో జరిగిపోయాయి. తొలి కేసు నమోదై రోజుకు ఒక్కరోజు ముందే సామాన్యులకు కూడా కరోనా టీకా అందుబాటులోకి వచ్చేసింది.

కరోనా సృష్టించిన ‘లాక్‌డౌన్‌’కు కోట్లాది మంది ఇళ్లల్లోనే బందీలయ్యారు. అంతటా ఒక భయానక నిశ్శబ్దం. కేసుల సంఖ్య నానాటికీ పెరిగి వేలు, లక్షల్లోకి చేరింది. ముఖ్యంగా.. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నిత్యం వేలాది కేసులు నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని.. ఎంతో మంది సామాన్యుల జీవితాలు కుదేలైపోయాయి. కానీ.. కష్టాలు కలకాలం ఉండవన్నట్టు.. నవంబరు నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. డిసెంబరు నాటికి కొత్త స్ట్రెయిన్‌, సెకండ్‌ వేవ్‌ అంటూ చాలామంది భయపెట్టినా రాష్ట్రంలో వాటి ప్రభావం కనిపించకపోవడం విశేషం.

మరోవైపు.. జూన్‌ నెల నుంచి కొద్దికొద్దిగా ఆంక్షలు సడలిస్తూ కేంద్రం చేపట్టిన అన్‌లాక్‌ ప్రక్రియతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరడం మొదలైంది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలపైకెక్కింది. అన్నిటికీ మించి.. రికార్డు స్థాయిలో ఏడాదివ్యవధిలోనే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాలు అన్ని విధాలా సాయం అందించడం వల్ల మన కంపెనీలు భారీగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ప్రపంచానికే ఆశాదీపాలుగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు.

దేశీయ భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకాను అందుబాటులోకి తేవడం, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాను పుణెలో సీరం సంస్థ ఉత్పత్తి చేయడంతో మనకు వ్యాక్సిన్లు అందుబాటు ధరల్లో దొరకడం పెద్ద ఊరట. ఇవేకాక.. మరిన్ని టీకాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీయే అనుమతి లభించింది.

ఈ టీకా ఉత్పత్తికి ఆ సంస్థ మన హైదరాబాద్‌లోని ‘బయొలాజికల్‌-ఈ’తో ఒప్పందం కుదుర్చుకుంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ అమెరికా ప్రభుత్వానికి ఈ టీకాను ఒక్కో డోసు దాదాపు రూ.735కు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, టీకా హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో అది కూడా మనకు ఇంకా తక్కువ ధరకే దొరికే అవకాశం కనిపిస్తోంది. దీనికితోడు భారత్‌ బయోటెక్‌ సంస్థ.. ముక్కు ద్వారా తీసుకునే ‘నాసల్‌ టీకా’ ట్రయల్స్‌ను కూడా ఇప్పటికే ప్రారంభించింది. బహుశా ఏడాది చివరకు అది కూడా అందుబాటులోకి వస్తుంది.

అలాగే.. మొదట్లో ఈ టీకాలను 18 ఏళ్లు దాటినవారిపైనే పరీక్షించారు. ఫైజర్‌ సంస్థ 12 నుంచి 15 ఏళ్లలోపు వారిపై వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే అనుమతులు పొందింది. 6 నుంచి 17 ఏళ్లవారిపై ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. వీన్నింటి ఫలితాలూ సానుకూలంగా వస్తే పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీకాలకు తోడు ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న, అనుమతులు పొందిన టీకాలు కూడా మార్కెట్లోకి వస్తే.. ధరలు భారీగా దిగొస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే చాలా మందికి వైరస్‌ సోకడం.. వైరస్‌ సోకనివారు ముందస్తు జాగ్రత్తగా టీకాలు తీసుకోవడం వల్ల ఈ ఏడాది చివరికల్లా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే అవకాశం ఉందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. మనదేశంలో ఇప్పటికే దాదాపు కోటి మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. సోమవారం మొదలైన రెండో దశ వ్యాక్సినేషన్‌లో.. బీపీ, షుగర్‌, హృద్రోగాలు వంటి కోమార్బిడిటీస్‌తో బాధపడుతన్న 45-59 ఏళ్లవారు, 60 ఏళ్లు పైబడినవారు అంతా కలిపి 27 కోట్ల మంది దాకా వ్యాక్సిన్‌ వేయించుకోనున్నారు. ఈ దశ జూలై చివరి నాటికి ముగిసే అవకాశం ఉంది.

అయితే ‘కరోనా తగ్గిపోయింది.. ఇక మనకేం కాదులే’ అన్న ధీమాతో చాలా మంది మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, చేతులను శుభ్రం చేసుకోవడం.. తదితర జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. దీంతో ఫిబ్రవరి నుంచి కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో చాలామందిలో నిర్లక్ష్యం బాగా పెరిగిందని.. ఇది మంచిది కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు.