Idream media
Idream media
దేశ వ్యాప్తంగా అత్యధిక మందిని పట్టి పీడిస్తున్న సమస్య కరోనా. కరోనా వస్తే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని సంప్రదించాలి? క్వారంటైన్ లో ఉంటే ఏం చేయాలి? ఆస్పత్రికి వెళ్లాలంటే బెడ్లు ఖాళీ ఉన్నాయో, లేవో, ఉంటే ఎక్కడున్నాయో? ఒక వేళ ఇంట్లోనే చికిత్స పొందినప్పుడు అత్యవసర పరిస్థితి వస్తే ఎలా..? ఇలాంటి ఎన్నో సందేహాలు, ప్రశ్నలు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని, రాని వారిని కూడా పట్టి పీడిస్తున్నాయి. హెల్స్ లైను నెంబర్లు ఎన్నో ఉన్నా.. చాలా నెంబర్లు అక్కరకు రావడం లేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం పకడ్బందీగా హెల్ప్ లైను నిర్వహిస్తోంది. కొవిడ్ సమస్య ఏదైనా సరే.. 104 ఫోన్ వస్తే వెంటనే పరిష్కారం చూపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడంతో సమర్థవంతంగా పని చేస్తోంది.
స్పష్టమైన ఆదేశాలు
104 కాల్‌సెంటర్ సమర్ధంగా పని చేసేలా సీఎం జగన్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఎవరైనా బాధితుడు ఫోన్ చేస్తే సమాధానం చెప్పడంలోనే, సరైన పరిష్కారం చూపడంలో అశ్రద్ధ కనబరిచినట్లు ఒక్క ఫిర్యాదు అందినా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్లు ఈ కాల్ సెంటర్ పై గట్టి నిఘా ఉంచారు. ఆ నంబర్‌కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపేలా సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. దీంతో బాధితుడి చెప్పిన లక్షణాలను బట్టి, తీవ్రతను బట్టి ఆస్పత్రికి వెళ్లడమా? క్వారంటైన్‌కు పంపడమా? హోం ఐసొలేషనా?.. ఏం చేయాలన్నది స్పష్టంగా చెబుతున్నారు. కొవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్య లకు 104 నంబర్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలనే సీఎం ఆశయానికి అనుగుణంగా యంత్రాంగం పని చేస్తోంది.
మూడే మూడు గంటలు
104కి ఫోన్ చేస్తే చాలు.. మూడే మూడు గంటల్లోగా బెడ్‌తో సహా రోగులకు ఏది అవసరమో అది కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఆ మేరకు 104 కాల్‌సెంటర్‌లో తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ 104తో అనుసంధానం చేసేలా చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి 48 గంటల్లోగా నియామకాలను పూర్తి చేయాలన్నారు.
జేసీలకు సైతం బాధ్యతలు
జేసీలు (గ్రామ, వార్డు సచివాలయాలు – అభివృద్ధి) ఇక నుంచి కొవిడ్‌పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అందరూ అదే పనిలో నిమగ్నం అవుతున్నారు. దీంతో అనుకున్న స్థాయిలో ఏపీలో సేవలు అందేందుకు దోహదపడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స అందించే ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ పర్యవేక్షించాలి. నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్‌డెస్క్‌లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి. దాదాపు 355 కోవిడ్ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్సకు అనుమతించిన ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు) వద్ద నిరంతరం పర్యవేక్షణ జరగాలి.. అని జగన్ పేర్కొనడంతో ఆయా విధుల్లో వారు నిమగ్నమై ఉన్నారు.