Idream media
Idream media
మమతా బెనర్జీ మూడో సారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. అది హ్యాట్రిక్ సాధించినందుకు మాత్రమే కాదు.. ఆమెను ఓడించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పన్నిన అన్ని వ్యూహాలనూ చిత్తు చేసినందుకు. అంతటితో ఆగకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఈ చర్యల ద్వారా దేశ వ్యాప్తంగా దీదీ పేరు మార్మోగుతుంటే.. బెంగాల్ టీఎంసీ సీనియర్ నేతల్లో మాత్రం దిగులు మొదలైంది. అదేంటి… దేశ వ్యాప్తంగా తమ అధినేత్రి పాపులర్ అవుతున్న సమయంలో వీరికి దిగులెందుకు అనుకుంటున్నారా..? ఇందుకు కారణం.. వన్ పర్సన్.. వన్ పోస్టు.. నినాదమే.
ఇప్పుడు దీదీ బెంగాల్ లో ‘వన్ పర్సన్.. వన్ పోస్ట్’.. పాలసీని పాటిస్తున్నారు. బెంగాల్ లో సాధించిన అఖండ విజయంతో మమతాబెనర్జీ కొత్త తరహా మార్క్ పాలనకు శ్రీకారం చుడుతున్నారు. ఒకటికి మించి ఎక్కువ పోస్టులు ఉన్న ప్రజాప్రతినిధులను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తోంది. ఇలా అందరినీ ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వినూత్న సంస్కరణలు తీసుకొస్తున్నారు. అటు పార్టీ.. ఇటు ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ఇందులో భాగంగానే వన్ పర్సన్.. వన్ పోస్ట్ అంటూ కొత్త పాలసీని భుజానికెత్తున్నారు. ఈ పాలసీ ప్రకారం.. ఒక్కో నేతకు ఒకే పోస్ట్ లభించనుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఒకే వ్యక్తి వివిధ పోస్టుల్లో కొనసాగడం కుదరదు.
ప్రజాప్రతినిధులనే కాదు.. అధికారుల విషయంలో కూడా అదే పంథా అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 100 మున్సిపాలిటీల్లో కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు సీఎం మమత. పాత లీడర్లను సాగనంపుతూ కొత్తవారిని చైర్మన్ పోస్టుల్లో కూర్చోబెట్టారు సీఎం మమతా బెనర్జీ. మంత్రులుగా కొనసాగుతూనే.. మున్సిపాలిటీల్లో అడ్మినిస్ట్రేటర్స్‌గా కంటిన్యూ అవుతున్న అరుప్ రాయ్, రథిన్ ఘోష్, సుజిత్ బసు లాంటి నేతల్ని ఇప్పటికే ఆయా పోస్టుల నుంచి తొలగించారు. ఉత్తర్‌పర, కొన్నగర్, రిష్రా, భద్రేశ్వర్, బైద్యబాటి, సీరంపూర్, తార్కేశ్వర్, అరంబాగ్ వంటి మున్సిపాలిటీల్లో ఇప్పటికే చైర్మన్ పోస్టుల్లో మరొకరికి అవకాశం కల్పించారు.
అందరికీ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో సీఎం మమతా బెనర్జీ వన్ పర్సన్.. వన్ పోస్ట్ పాలసీ తీసుకొచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చారు మమతా బెనర్జీ. మొదటి నుంచీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పించాలని మమతా బెనర్జీ భావిస్తున్నట్టు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కరు ఒకే పోస్టులో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని టీఎంసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. సీనియర్లను పక్కనబెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని మరి కొందరు భావిస్తున్నారు. దీని వల్ల అసంతృప్తులు వెళ్లగక్కే అవకాశాలు ఉంటాయని, అదే జరిగితే బీజేపీ దీన్ని అవకాశంగా మార్చుకుంటుందని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.