iDreamPost
android-app
ios-app

తిరుగులేని సంగీత సంగమం – Nostalgia

  • Published Mar 31, 2020 | 10:36 AM Updated Updated Mar 31, 2020 | 10:36 AM
తిరుగులేని సంగీత సంగమం – Nostalgia

సంగీత దర్శకుడి నుంచి అవుట్ ఫుట్ రాబట్టుకోవడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుందన్నది వాస్తవం. అందులోనూ స్టార్లతో డీల్ చేసే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు ఇది చాలా కీలకం.అభిరుచిలో ఏ మాత్రం తేడా ఉన్నా దాని ప్రభావం నేరుగా ఫలితం మీద ఉంటుంది. అందుకే అడవి రాముడు లాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ లోనూ కోటి రూపాయల పాటను పుట్టించగలిగారు రాఘవేంద్రులు. 90వ దశకంలో ఎప్పుడైతే ఎంఎం కీరవాణితో ఈయన జట్టు కట్టారో అప్పటినుంచి గొప్ప ఆల్బమ్స్ కు శ్రీకారం చుట్టడమనేది అక్కడి నుంచే మొదలయ్యింది.

1992లో ఫస్ట్ టైం ఈ కాంబోలో ఘరానా మొగుడు వచ్చింది, తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి 10 కోట్ల షేర్ రాబట్టిన సినిమాగా అది సృష్టించిన రికార్డులలో కీరవాణి సంగీతానికి చాలా కీలక పాత్ర. ఇది కాకుండా ఈ కాంబినేషన్ వెంటనే మరో అద్భుతమైన హ్యాట్రిక్ సాధించింది. సుందరకాండ – అల్లరి మొగుడు – అల్లరి ప్రియుడు ఈ మూడు దేనికవే అహో అనిపించేసి పాటలతో ఆడియో కంపెనీలకు కనక వర్షం కురిపించాయి. ఇది అక్కడితో ఆగిపోలేదు. మేజర్ చంద్రకాంత్ మరో సంచలనం. మ్యూజికల్ గానూ అదరగొట్టింది. అల్లరి ప్రేమికుడు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా సంగీతం నిరాశపరచలేదు. ముద్దుల ప్రియుడు – ఘరానా బుల్లోడు సైతం ఇదే దారిలో పయనించాయి.

ఇక పెళ్లి సందడి క్యాసెట్ల అమ్మకాల్లో సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక ఫామిలీ సినిమా ఆడియో ఈ రేంజ్ లో అమ్ముడుపోవడం చూసి ట్రేడ్ నివ్వెరబోయింది. ఇక అన్నమయ్య గురించి చెప్పదేముంది. ఆ స్వరామృతంలో తడిసిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆపై గంగోత్రి, శ్రీరామదాసులు ఈ కాంబినేషన్ ని ఎవర్ గ్రీన్ గా నిలుపుతూనే వచ్చాయి. కలిసి ఎన్ని సినిమాలు చేసినా రిజల్ట్ తో సంబంధం లేకుండా రాఘవేంద్ర రావు – కీరవాణిల కాంబినేషన్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. దర్శకేంద్రుల వారు కొంత విరామం తీసుకున్నారు కానీ మళ్ళీ కలిసి పనిచేయాలే కానీ మళ్ళీ మళ్ళీ అద్భుతాలు చేయగలిగిన సత్తా చేవ ఈ ఇద్దరిలోనూ ఉంది.