iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్‌కు భారత రత్న.. కావాల్సింది తీర్మానం కాదు చిత్తశుద్ధి

ఎన్టీఆర్‌కు భారత రత్న.. కావాల్సింది తీర్మానం కాదు చిత్తశుద్ధి

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ఆయన జయంతి, వర్థంతి రోజున తాను, తన పార్టీ నేతల చేత డిమాండ్‌ చేయించడం, ఏడాదికి ఒకసారి నిర్వహించే మహానాడులో తీర్మానం చేయడం జరుగుతోంది. తాజాగా జరిగిన మహానాడులోనూ అదే తీర్మానం రిపీట్‌ అయింది.

ఎన్టీఆర్‌ మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రాష్ట్ర విభజన తర్వాతనూ అధికారం చేపట్టలేదు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించే అవకాశం ఆ పార్టీకి దక్కలేదు అనుకోవచ్చు. కానీ 1995లో ఎన్టీఆర్‌ నుంచి అధికారం పొందిన చంద్రబాబు ఆ తర్వాత 1999లో కూడా బీజేపీతో పొత్తుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత దాదాపు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999లో ఎన్టీఏ కన్వీనర్‌గా కూడా చంద్రబాబు ఉన్నారు. కేంద్రంలోని వాజపేయి సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పటికి మోడీ కూడా లేరు. వాజపేయి కూడా సౌమ్యులు.

రాష్ట్రపతిని, ప్రధానులను ఎంపిక చేశానని, కేంద్రంలో చక్రం తిప్పానని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. మరి ఇలాంటి చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ, పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయారు ..? అనే సందేహం సాధారణ టీడీపీ కార్యకర్తలోనూ తలెత్తుతోంది.

సరే, టీడీపీ చంద్రబాబు హస్తగతం అయిన ప్రారంభ సమయం.. ఎన్టీఆర్‌ పోయినా.. ఆయనపై చంద్రబాబుకు కోపం తగ్గకపోవడం వల్లే అప్పట్లో భారత రత్న ఇప్పించలేకపోయారని భావిద్దాం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో మళ్లీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1999లో మాదిరిగా 2014లో కూడా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచారు. కేంద్రంలో భాగస్వామి కూడా అయ్యారు. కాకపోతే అప్పుడు వాజపేయి. ఇప్పుడు మోడీ. మోడీతో గతంలో ఉన్న వైరాలు కూడా పక్కనబెట్టి చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 2014 నుంచి 2018 వరకూ అంటే దాదాపు 4 ఏళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ప్రతి ఏడాది మహానాడు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నారు. ఆ డిమాండ్‌లో నిజయతీ, ఆ తీర్మానంలో చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్‌కు ఎందుకు భారత రత్న ఇప్పించలేకపోయారనే మౌలిక ప్రశ్న అందరి నుంచి వినిపిస్తోంది.

చంద్రబాబు అధికారంలో లేనప్పుడు, టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు గానీ,ఆ పార్టీ నేతలకు గానీ ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తారనేది నానుడి. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే మాట ఈ సమయంలోనే బలంగా వినిపిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు వంటి సమర్థుడు, మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి తమ పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేకపోయారనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఎన్టీఆర్‌ పేరుతో రాజకీయాలు చేసే చంద్రబాబు తీరును ప్రజలే కాదు.. టీడీపీ శ్రేణులు కూడా గుర్తించాయి. అందుకే టీడీపీ పగ్గాలు జూనియర్‌ ఎన్టీఆర్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్నాయి.

Also Read : మహానాడుకు మాత్రమే మినహాయింపా..?