iDreamPost
iDreamPost
కొన్నాళ్లుగా స్తబ్దత ఆవరించిన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో మళ్లీ కదలిక వచ్చింది. రెండు రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న తీరు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కేసీఆర్ తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. గవర్నర్ల వ్యవహార శైలి, రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది.
రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా గవర్నర్లు
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండేళ్లుగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వంపై బహిరంగ వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్, ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. చివరికి గవర్నర్ అధికారిక ట్విట్టర్ నుంచి సీఎం మమత వైదొలిగారు.
Also Read : మేనల్లుడికి మమత ఝులక్.. తృణమూల్‌లో కుమ్ములాటలు
కాగా బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ప్రొరోగ్ చేసిన తీరును తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుపడుతూ ట్వీట్ చేయడం తాజా సంచలనంగా మారింది. ఈ ఆరోపణలను గవర్నర్ ఖండించారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వైఖరిపైనా స్టాలిన్ ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షం సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. అసెంబ్లీ ఆమోదించి పంపిన యాంటీ నీట్ బిల్లును గవర్నర్ తిప్పి పంపడం విమర్శలకు తావిచ్చింది. ఆ బిల్లును అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపడంతో రాజ్యాంగంలోని 200 అధికరణ ప్రకారం గవర్నర్ ఆమోదముద్ర వేయకతప్పలేదు. ఇక ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంతో అక్కడి లెఫ్టినెంట్ గవర్నరుతో మొదటినుంచి వివాదాలు ఉన్నాయి.
ముగ్గురు సీఎంల మంతనాలు
ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు, తెలంగాణ సీఎంలతో ఫోన్ సంభాషణలు జరపడం చర్చనీయాంశం అయింది. మొదట స్టాలిన్ తో మాట్లాడిన ఆమె గవర్నర్ల వ్యవహార శైలిపై చర్చించారు. వారి తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. దీనిపై బీజీపీయేతర ముఖ్యమంత్రులు పోరాడాల్సిన అవసరం ఉందని భావించినట్లు స్టాలిన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వచ్చే నెలలో ఈ సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదన ఉందన్నారు. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు సోమవారం ఉదయం మమతా ఫోన్ చేసి సంభాషించారు. జాతీయస్థాయిలో ఎన్డీయే కు వ్యతిరేకంగా పోరాటం జరపడంపై వారు చర్చించుకున్నారు. వరుసగా రెండురోజులపాటు ప్రెస్మీట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్న కేసీఆర్ ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను మమతా కు వివరించినట్లు సమాచారం.
Also Read : అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ.. : కేసీఆర్