Idream media
Idream media
సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలను సమీక్షించేందుకు ఏర్పాటైన కమిటీ దీనిపై సమాలోచనలు జరుపుతోంది. ఇప్పటికే మూడు సార్లు సమావేశం అయింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రేక్షుకుల సంఘం తరపున కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో తమ తమ డిమాండ్లను ఆయా వర్గాలు ప్రభుత్వానికి వినిపించాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ వాటిని నోట్ చేసుకుంది.
టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 35పై పలువురు నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్ లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్ట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో ను రద్దు చేసింది. దీంతో హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సింగిల్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీంతో హైకోర్టులో సినిమా టికెట్ల ధరలపై విచారణ జరుగుతోంది. ఈ లోపే కమిటీ భేటీలు పూర్తి చేసి ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. దాని ద్వారా సమస్య త్వరగా కొలిక్కి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎంతెంత టిక్కెట్ ధరలు ఖరారు చేస్తుందో క్లారిటీ వస్తుంది.
ఈ క్రమంలో సచివాలయంలో కమిటీ తాజాగా మరోసారి అమరావతిలో సమావేశమైంది. సినీ పరిశ్రమ తరపున హాజరైన ముత్యాల రాందాస్ టిక్కెట్ రేట్లను పెంచాలని కోరామని తెలిపారు. సినిమా టిక్కెట్ రేట్లపై కమిటీ రిపోర్ట్ కోసం టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తున్నారన్నారు. సినిమా టిక్కెట్ రేట్ల అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని .. ఇంకో మీటింగ్ జరిగితే క్లారిటీ వస్తుందని కమిటీలో చర్చలకు సెన్సార్ బోర్డు తరపున హాజరైన ఓం ప్రకాష్ తెలిపారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. టికెట్ ధరల సమస్యపై ఈ నెల పదిన న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉన్నందున ఆ లోపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Also Read : చింతామణి నాటకంపై హైకోర్టు కీలక ఆదేశాలు