Idream media
Idream media
కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమైక్రాన్ ఆందోళన భారత్‌లోనూ మొదలైంది. ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ నూతన వేరియంట్ మునుపటి వేరియంట్ల కన్నా వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ 25 దేశాలకు వ్యాపించింది.
తాజాగా భారత్‌లోకి ఈ వైరస్ ప్రవేశించిందనే అనుమానాలు నెలకొన్నాయి. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు తెలంగాణ వైద్యశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఆమె నమూనాలు సేకరించిన అధికారులు.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఆమెను టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒమైక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం వివిధ దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన 320 మందికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఒమైక్రాన్ వైరస్ సోకినట్లు అధికారులు అనుమానించి అప్రమత్తమయ్యారు.
ఒమైక్రాన్ ప్రమాదం పొంచి ఉందన్న తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్.. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఆస్పత్రుల్లో చేరే పరిస్థితి నుంచి, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని శ్రీనివాస్ స్పష్టం చేశారు. డిసెంబర్ ముగిసేలోపు తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగించేలా ప్రణాళికలు రచించామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లేనని వ్యాఖ్యానించారు.
ఒమైక్రాన్ వైరస్ వ్యాప్తి అనుమానాలతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ నిబంధనలను అమలు చేసే చర్యలపై దృష్టి పెట్టింది. మాస్క్‌ను తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని తెలిపింది. లేదంటే వేయి రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ ఆంక్షలను అమలు చేయాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read : Omicron Virus – కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ ప్రభావం ఎంత, మన దేశంలోనూ మళ్లీ సమస్యలు తప్పవా?