Idream media
Idream media
ఈ ఏడాదిలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు పూర్తి కాగా, వచ్చే ఏడాది తొలి నాళ్లలో మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఢీ అంటే ఢీ అంటుండగా.. తాజాగా భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లకు కసరత్తు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నాహాలు ఓ వైపు ప్రారంభిస్తుండగా.. మరోవైపు ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలా, వద్దా.. అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
త్వరలో ఎన్నికల సంఘం బృందం.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ఎన్నికల ప్రకటన వెలువడుతుందని వార్తలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో ప్రచార సభలకు వేలాది మందిని తరలించడంపై సొంత పార్టీ నుంచే బీజేపీకి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గజేంద్ర షెకావత్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఎన్నికల ప్రచారాలను వర్చువల్‌గా నిర్వహించేందుకు తమపార్టీ సిద్దంగా ఉందని ప్రకటించారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను, పార్టీల ప్రచార సభలను వాయిదా వేసుకునే అంశాన్ని పరిశీలించాలంటూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల అలహాబాద్ హైకోర్టు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘‘ ప్రచారాలపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలను, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తాం. బీజేపీ ఆన్‌లైన్ ఎన్నికల ప్రచార సభల్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో మా పార్టీ వర్చువల్ ప్రచార సభలను నిర్వహించింది’’ అని బీజేపీ పంజాబ్ ఎన్నికల ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్న షెకావత్ మీడియాకు చెప్పారు.
కాగా, కొవిడ్ మార్గదర్శకాలను కఠినంగా అమలుచేస్తూ.. షెడ్యూల్ ప్రకారమే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన ఎన్నికల సంఘం ప్రతినిధి బృందాన్ని బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్డీ నేతలు కోరారు. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా వేయకుండా.. అలాగని ప్రచారం కారణంగా వైరస్ వ్యాప్తి చెందకుండా మధ్యేమార్గంలో వర్చువల్ విధానంపై పొలిటికల్ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.