iDreamPost
android-app
ios-app

ఆ కిల్లర్ కు కరోనా పాజిటివ్‌.. జైలు, అస్పత్రి సిబ్బందిలో ఆందోళన..

ఆ కిల్లర్ కు కరోనా పాజిటివ్‌.. జైలు, అస్పత్రి సిబ్బందిలో ఆందోళన..

ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో అనారోగ్య కారణాలతో మృతి చెందినా.. కోవిడ్‌ పరీక్ష తప్పనిసరిగా చేస్తున్నారు. ఆ క్రమంలో మృతి చెందిన వారిలో చాలా మంది కరోనా పాజిటివ్‌ అని తేలుతోంది. ఇటీవల అనారోగ్యం కారణంగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ కూడా కరోనా పాజిటివ్‌ వల్ల ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపై ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినా.. కోవిడ్‌ నిబంధనలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయడం గమనార్హం.

అయితే.. తాజాగా విశాఖ జైలు, కేజీహెచ్‌ ఆస్పత్రి సిబ్బందిలో అందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఇటీవల పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్‌ మొద్దు శ్రీనును హత్య చేసి విశాఖ సెంట్రల్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓం ప్రకాశ్‌ కిడ్నీలు విఫలం అయి చనిపోయిన విషయం తెలిసిందే.

కిడ్నీ డయాలసిస్‌ కోసం నాలుగేళ్ల నుంచి ఓం ప్రకాశ్‌ విశాఖ సెంట్రల్‌ జైలులో ఉంటూ కేజీహెచ్‌లో వైద్య సేవలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డయాలసిస్‌ చేస్తున్న సమయంలోనే ఆయన ఇటీవల మృతి చెందారు. తాజాగా ఓం ప్రకాశ్‌ భౌతిక కాయం నుంచి నమూనాలు సేకరించి కరోనా పరీక్ష చేయగా.. కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఓం ప్రకాశ్‌ను జైలు నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చిన సిబ్బందిలోనూ, కేజీహెచ్‌ ఆస్పత్రి సిబ్బందిలోనూ అందోళన నెలకొంది. విషయం తెలిసిన వెంటనే వారంతా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. కరోనా పరీక్ష చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.