iDreamPost
android-app
ios-app

ఆయిల్ ధరలేందురోయ్ : ఎన్నిక‌ల‌ప్పుడు అలా.. అయ్యాక ఇలా..!

ఆయిల్  ధరలేందురోయ్ : ఎన్నిక‌ల‌ప్పుడు అలా.. అయ్యాక ఇలా..!

అసలే ఒకవైపు ప్రజలు కరోనా విపత్తుతో అల్లాడిపోతున్నారు. పరిశ్రమలు మూతపడి, ఉద్యోగాలు కోల్పోయి, ఉన్నా.. వేతనాలు కోతకు గురై ఆదాయం లేక అవస్థలు పడుతుంటే పెరుగుతున్న ధరలు మరింత కుంగదీస్తున్నాయి. ఎన్నికల కాలంలో దాదాపు 66 రోజులపాటు చమురు ధరలు నిలకడగా ఉండేలా, లేదా తగ్గేలా జాగ్రత్తలు తీసుకున్న కేంద్ర సర్కారు ఫలితాలు వెలువడగానే యథాప్రకారం చమురు ధరలు పదేపదే పెంచుతూ ప్రజలపై ప్రతాపం చూపిస్తోంది. ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల రవాణాపై పడడంపై వాటి ధరల కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

12 రోజుల్లో.. 9 సార్లు పెట్రో బాదుడు

ఫిబ్రవరి 26, 2021 పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూలును ఈసీ ప్రకటించారు. ఈ ఏడాది మొదటి నుంచి ఫిబ్రవరి 26 దాకా.. 21 సార్లు పెరిగిన చమురు ధరలు.. అదేంటోగానీ, ఎన్నికల కమిషన్‌ అలా ప్రకటన చేయగానే ఇలా ఫిబ్రవరి 27 నుంచి నిలిచిపోయాయి. అంతేకాదు.. మార్చి 24, 25 తేదీల్లో వరుసగా తగ్గాయి కూడ. ఆ తర్వాత మార్చి 30న మరోసారి తగ్గాయి. అప్పటి నుంచి ఏప్రిల్‌ 15 దాకా మళ్లీ నిలకడగా ఉన్నాయి. ఏప్రిల్‌ 15న మరోసారి పెట్రోల్‌పై లీటరుకు 16 పైసలు, డీజిల్‌పై 14 పైసలు తగ్గించారు. మే2న ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. అంతే! మే 4 నుంచి మళ్లీ పెరుగుదల మొదలైంది.

అంటే.. 65 రోజులపాటు, నిలకడగా ఉన్నాయి లేదా తగ్గాయి తప్ప చమురు ధరలు పెరగడమనే మాటే లేదు. అప్పట్నుంచీ 12 రోజుల్లో.. అంటే మే 16 (ఆదివారం) నాటికి 9 సార్లు ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలను ఆయిల్‌ కంపెనీలే నియంత్రిస్తుంటాయని, ప్రభుత్వం చేతుల్లో ఏమీలేదని ధరలు పెరిగిన ప్రతి సందర్భంలో కేంద్రం ప్రకటిస్తూ ఉంటుంది. కానీ.. అది వాస్తవంకాదని మరోసారి తేలిపోయింది.

సబ్సిడీకి చెల్లుచీటీ

వంటగ్యాస్‌ సబ్సిడీని 2019 ఎన్నికల వరకు అమలుచేసిన కేంద్ర ప్రభుత్వం… ఆ తర్వాత ఆ బాధ్యతను వదిలేసి చేతులు దులుపుకొంది. దీంతో, దాదాపు ఏడాదిన్నరగా గ్యాస్‌ వినియోగదారులకు సబ్సిడీ రావటం లేదు. అంతేకాదు.. వంటగ్యాస్‌ ధరలను కూడా ఆయిల్‌ కంపెనీలు ప్రతి పక్షం రోజులకోసారి సవరిస్తున్నాయి. సవరించడమంటే.. ప్రతిసారీ రూ.50-100 చొప్పున పెంచుతూ పోవడమే తప్ప తగ్గించట్లేదు. 2020 జూలై నెలలో 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 645.50 పైసలు ఉండేది. 2020 డిసెంబర్‌లో రూ.100 పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.75 పెరిగింది. మార్చి నెలలో రూ.50 పెరిగింది. ఇప్పుడు ఏకంగా రూ.861.50కి ఎగబాకింది. దీంతో, గ్రామీణ ప్రాంతాలవారు, పేదలు గ్యాస్‌ పోయ్యిలను పక్కన పడేసి మళ్లీ పాత పద్ధతులకు (కట్టెల పొయ్యి వైపు) మళ్లితే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాత్రం సిలిండర్లపైనే ఆధారపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

50 శాతం పెరిగిన నూనె ధర

కొన్ని నెలలుగా దేశవ్యప్తంగా వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. నూనెలు కొనాలంటే చేతి చమురు వదులుతోంది. గతేడాదితోపోలిస్తే 50 శాతం ధరలు పెరిగాయి. విజయ పల్లి నూనె గరిష్ఠ చిల్లర ధర లీటరుకు ప్రస్తుతం రూ.198గా ఉండడం గమనార్హం. ప్రైవేటు కంపెనీల పల్లి నూనె ధరలు రూ.200 నుంచి రూ. 220 చొప్పున పలుకుతున్నాయి. పొద్దుతిరుగుడు నూనె ధర రూ.175 నుంచి రూ.195 వరకు ఉంది. దీనికితోడు.. రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మనకు మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాల నుంచి పామాయిల్‌, పొద్దుతిరుగుడు నూనెలకు సంబంధించిన ముడిసరకు దిగుమతి అవుతుంటుంది. కేంద్రమేమో.. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలంటూ దిగుమతులపై పన్నులు పెంచింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా సరఫరాచేయలేని పరిస్థితి ఏర్పడిందని, నూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

కూర‘గాయాలు’

కరోనా వేళ రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి ప్రజలు పసుపు, అల్లం, వెల్లుల్లి తదితర సుగంధ ద్రవ్యాల వినియోగాన్ని, కూరగాయల వాడకాన్ని గణనీయంగా పెంచారు. దీంతో వీటి ధరలు పెరిగాయి. ఏ రకం కూరగాయల ధరలైనా సగటున కిలోకు రూ. 40 నుంచి రూ. 60 చొప్పున ధర పలుకుతున్నాయి. దీంతో వినయోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు.. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 20 గంటలు లాక్‌డౌన్‌ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించింది. కొనుగోళ్లకు నాలుగు గంటలకు మించి సమయం లేకపోవడంతో కొందరు వ్యాపారులు ప్రజల నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్నారు. ధరలు పెంచి అమ్ముతున్నారు. ట్రాన్స్‌పోర్టు లేదని, దిగుబడి, దిగుమతి లేదని చెబుతూ వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. ఈ ధరల నియంత్రణకు అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.