iDreamPost
android-app
ios-app

సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష!

  • Published Feb 13, 2022 | 4:27 PM Updated Updated Feb 13, 2022 | 4:27 PM
సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష!

ప్రజాస్వామ్యంలో ఎన్నిక ద్వారా ప్రజాప్రతినిధులను ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే పంచాయతీ స్థాయిలో సర్పంచులు, వార్డు సభ్యులను ఆయా గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రకరకాల పద్ధతులు అనుసరిస్తుంటారు. కొన్ని చోట్ల సర్పంచ్ పదవిని వేలం వేస్తుంటారు. ఎక్కువ మొత్తానికి పాడుకున్న వ్యక్తికి ఓట్లు వేసి గెలిపిస్తుంటారు. ఆయన ఇచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు. మరికొన్ని ఊళ్లలో పెద్దలందరూ కూర్చొని ఒకరిని ఖరారు చేసి.. అతన్ని ఏకగ్రీవంగా గెలిపిస్తుంటారు. ఇవన్నీ కాకుండా అన్ని ఎన్నికల మాదిరిగానే ఓటుకు ఇంత అని అభ్యర్థులు ఇచ్చే డబ్బులు, ఇతర నజరానాలు తీసుకుని తమకు నచ్చినవారికి ఓట్లు వేస్తుంటారు. కానీ ఒడిశాలోని సుందర్ ఘడ్ జిల్లా కుత్రా పంచాయతీ మలుపడ ప్రజలు వీటన్నింటికీ భిన్నమైన పద్ధతికి శ్రీకారం చుట్టారు. తమ సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి సంచలనం రేపారు.

ముగ్గురు పాస్.. ఐదుగురు ఫెయిల్

ఒడిశాలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 24 వరకు దశలవారీగా పోలింగ్ జరుగనుంది. అందులో భాగంగా గిరిజన గ్రామమైన మలుపడ సర్పంచ్ పదవికి తొమ్మిదిమంది పోటీ పడుతున్నారు. స్థానిక ప్రజలు రాతపరీక్ష ద్వారా ఒక అభ్యర్థిని ఖరారు చేసి.. ఎన్నుకోవాలని నిర్ణయించారు. అభ్యర్థులందరినీ పిలిపించి ఆ విషయం చెప్పగా వారు కూడా అంగీకరించారు. దాంతో గ్రామస్తులు చర్చించుకుని ప్రశ్నాపత్రం రూపొందించారు. గత ఐదేళ్లలో ఏం చేశారు. ఇంతకుముందు చేసిన ఐదు మంచి కార్యక్రమాలు, ఏ లక్ష్యంతో పోటీ చేస్తున్నారు, గెలిస్తే ప్రజలతోనే ఉండి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారా.. వంటి ప్రశ్నలతో రాతపరీక్ష నిర్వహించారు. తొమ్మిదిమందిలో ఎనిమిదిమంది పరీక్షకు హాజరుకాగా వారిలో ఐదుగురు ఫెయిల్ అయ్యారు. ప్రస్తుత సర్పంచ్ లలిత బారువ సహా ముగ్గురు పాస్ అయ్యారు. ఈ ముగ్గురి నుంచి ఒక్కరిని ఎంపిక చేసేందుకు మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు.

ఈ విధానం తప్పు..

ఇలా అభ్యర్థులకు రాత పరీక్ష జరపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సర్పంచ్ అభ్యర్థులు, గ్రామస్తులు దీన్ని సమర్ధిస్తుండగా.. అధికారులతో సహా పలువురు తప్పు పడుతున్నారు. నిబంధనల ప్రకారం పోటీలో ఉన్నవారిలో నచ్చిన వారికి ఓట్లు వేస్తే.. మెజారిటీ ఓట్లు పొందినవారు ఎన్నిక కావడం పద్ధతి అని అనేకమంది వాదిస్తున్నారు. దానికి భిన్నంగా ఏ విధానం అనుసరించినా తప్పే అవుతుందంటున్నారు. బ్లాక్ ఎన్నికల అధికారి రవీంద్ర సేథీ కూడా రాత పరీక్ష ద్వారా అభ్యర్థిని ఖరారు చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని.. అయితే ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read : అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ.. : కేసీఆర్