Idream media
Idream media
చెప్పింది మరచిపోతుందో.. ఆలోచించకుండా పేర్కొంటుందో తెలియదు కానీ.. ఇటీవలి కాలంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఏపీ రైల్వే జోన్ విషయంలో కూడా సమావేశానికో మాట మారుస్తోంది.తాజాగా ఓబీసీ కులగణనపై మోడీ సర్కార్ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఓబీసీల జనగణన చేపట్టాలని సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌కి మద్దతు పెరుగుతోంది. పలు రాష్ట్రాలు కూడా ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపాయి. వాటిలో తెలంగాణ, ఏపీ సహా.. మహారాష్ట్ర, బిహార్, ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి.
ఓబీసీల జనగణన చేస్తామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ రెండున అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘2021 జనాభా లెక్కల్లో మొదటి సారిగా ఓబీసీల గణాంకాలు’ సేకరిస్తామని ప్రకటించారు. ఓబీసీల్లో సబ్ కేటగిరీ చేయడం కోసం కేంద్ర ఒక కేబినెట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే, ఈ హామీని తోసిరాజంటూ ఇప్పుడు ఓబీసీల వివరాలు లేకుండా 33 ప్రశ్నలతో జనాభా లెక్కలు సేకరించాలని నిర్ణయించారు. అందులో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే వివరాలు మాత్రమే ఉన్నాయి. దీని వల్ల ఓబీసీలు మరోసారి మోసపోయే ప్రమాదం ఏర్పడిందని గుర్తించిన ఆయా సంఘాలు కొంత కాలంగా ఉద్యమాలు చేస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటన ఓబీసీల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ (సెన్సెస్) సరైన సాధనం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన మీదట జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. బీసీ జనాభా లెక్క తేల్చేందుకు వీలుగా సెన్సెస్‌లో కులగణన జరిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయం హోం మంత్రిత్వ శాఖకు తెలుసునని చెప్పారు.
Also Read : లక్ష్యం దిశగా జగన్ అడుగులు.. అసెంబ్లీలో మరో కీలక తీర్మానం
దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) ఉద్దేశం కాదని మంత్రి అన్నారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్‌ఎస్‌ఎస్ ఇంటింటి సర్వే చేపడుతుందని వెల్లడించారు. మరి గతంలో ఎందుకు హామీ ఇచ్చినట్లో వారికే తెలియాలి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జనాభా లెక్కల సేకరణ జరగనుంది. ప్రతి పదేండ్లకోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత జనాభా లెక్కల రిజిస్ట్రార్ ఈ గణాంకాలను సేకరిస్తారు.కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే దేశంలో ఆయా కులాల మధ్యన ఘర్షణ జరిగే ప్రమాదముందని చెబుతూ ఇప్పటి వరకు ఓబీసీ జనగణన చేయలేదు.
చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీల గణాంకాలు తప్పనిసరి కావడంతో వారికి సంబంధించిన సమాచారాన్ని జనాభా లెక్కల్లో భాగంగా సేకరిస్తున్నారు. అలాగే మతపరమైన వివరాలు, భాషా పరమైన సమాచారం కూడా ఈ గణాంకాల్లో సేకరిస్తున్నారు. ఈ సమాచారం సేకరించినప్పుడు జరగని ఘర్షణలు కులపరమైన సమాచారం సేకరిస్తే జరుగుతాయని చెప్పడంలో అర్థమేంటని పలు సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఓబీసీల సబ్ కేటగిరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోహిణి కమిటీ కాల పరిమితిని పొడిగిస్తూ ఆ సామాజిక వర్గాల పట్ల తమ పట్టిలేని తనాన్ని ప్రభుత్వం ప్రకటించుకుందని విమర్శిస్తున్నాయి.
బీజేపీ వాళ్లు చాలా సార్లు మా ప్రధాన మంత్రే ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు, మాకు వారి పట్ల ఎలాంటి వివక్ష లేదు అని ప్రకటించుకుంటున్నారు. కానీ, ఆచరణలో మాత్రం ఓబీసీల పట్ల బీజేపీ పూర్తిగా వివక్షతో వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇచ్చిన మాటను అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆయా సంఘాలు విమర్శిస్తున్నాయి. లెక్కలు సేకరించినట్లయితే కచ్చితమైన సమాచారం ఉంటుంది కాబట్టి తమ జనాభా దామాషాలో విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తారని, అదే విధంగా ఓబీసీలు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉండడం వంటి కారణాలతో దీనిపై కాలయాపన చేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read : బీసీల జనగణనపై బీజేపీ ఎందుకు మాట మార్చింది?