iDreamPost
android-app
ios-app

o2 movie review ఓ2 రిపోర్ట్

  • Published Jun 18, 2022 | 12:00 PM Updated Updated Jun 18, 2022 | 12:00 PM
o2 movie review ఓ2 రిపోర్ట్

ఇటీవలే పెళ్లిపీటలు ఎక్కి తన వివాహ వేడుకను సామాన్య జనంతో పాటు మీడియా మొత్తం మాట్లాడుకునే స్థాయిలో మిసెస్ విఘ్నేష్ శివన్ గా మారిన నయనతార కొత్త సినిమా ఓ2 నిన్న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజయ్యింది. పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. ఆ మధ్య నేత్రికన్ తర్వాత నయన్ కు ఇది రెండో డైరెక్ట్ ఓటిటి రిలీజ్. ఇందులో స్టార్ హీరో అంటూ ఎవరూ లేరు. కేవలం తన ఇమేజ్ ని బ్రాండ్ ని వాడుకుని నిర్మాతలు మార్కెటింగ్ చేశారు. కాకపోతే ఇలాంటివి థియేటర్లలో వర్కౌట్ కావని గుర్తించి డిజిటల్ కు వెళ్లిపోయారు. ట్రైలర్ ఓ మాదిరి అంచనాలు రేపింది. మరి ఈ డిఫరెంట్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేసిందో లేక కిల్ చేసిందో రిపోర్ట్ లో చూద్దాం.

అనారోగ్యంతో భర్త చనిపోయాక కొడుకు వీర(రిత్విక్)ని ప్రాణంగా పెంచుతుంది పార్వతి(నయనతార). వీరకు కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఉంటుంది. దీన్ని నయం చేయించడానికి ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. దాని కోసమే తమ్ముడు ఉండే కొచ్చికి బాబుని తీసుకుని బస్సులో బయలుదేరుతుంది. కానీ అనుకోకుండా లోయలో ప్రమాదం జరిగి బస్సు ఆక్సిజన్ అందని ప్రాంతంలో పడిపోతుంది. రకరకాల మనస్తత్వాలు ఉండే మనుషుల మధ్య తమ వద్ద ఉన్న ఒక్కగానొక్క సిలిండర్ ని కాపాడుకోవడం పార్వతికి సవాల్ అవుతుంది. మరి ఆ ఓ2 కోసం జరిగే సంఘర్షణలో ఎవరు గెలిచారు వీర ఏమయ్యాడు అంటే సినిమాలో చూడాలి

హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన దర్శకుడు విక్నేష్ లైన్ అయితే ఇంటరెస్టింగ్ గానే తీసుకున్నాడు కానీ దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో ఫెయిలయ్యాడు. డ్రామా ఎక్కువైపోయి అవసరం లేని సన్నివేశాలను నింపడంతో ఓ2 సహనానికి పెద్ద పరీక్షే పెడుతుంది. ఒకే లొకేషన్ లో తక్కువ పాత్రలతో కథ నడిపిస్తున్నప్పుడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అవసరం. కానీ విక్నేష్ అదేమీ పట్టించుకోలేదు. ఎడిటింగ్, సంగీతం బ్యాడ్ ప్రోడక్ట్ ని కాపాడలేకపోయాయి. క్లైమాక్స్ నీరసం తెప్పిస్తుంది. భర్త పేరుకి దగ్గరగా ఉందని ఈ డైరెక్టర్ ఓకే చెప్పిందో లేక రెమ్యునరేషన్ వస్తే చాలని స్క్రిప్ట్ ని పూర్తిగా చదవకుండా ఓకే చేసిందో తెలియదు కానీ మొత్తానికి ఓ2 తేడా కొట్టేసింది