Idream media
Idream media
భారత రాజకీయాల్లో అమెరికన్ మీడియా ప్రకంపనలు సృష్టించింది. న్యూయార్క్ టైమ్స్ రాసిన ఒక కథనం ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారి బడ్జెట్ సమావేశాల ముందు కేంద్రాన్ని ఇరుకున పెట్టింది. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్‌ను భారత్‌కు విక్రయించినట్లు న్యూయార్క్ టైమ్స్ “ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ సైబర్ వెపన్” పేరుతో ఒక కథనం రాసింది. జులై 2017లో దీనికి సంబంధించి ఒప్పందం జరిగి, కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తైపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళారని పేర్కొన్నది.
హిందూ జాతీయవాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ… ఇజ్రాయెల్ ను సందర్శించిన మొదటి భారత ప్రధాని అయ్యారని పేర్కొంది. ప్రధానమంత్రి మోడీ పర్యటనను ప్రస్తావిస్తూ… ఆయన ఆ టైం లో చాలా జాగ్రత్తగా స్నేహ పూర్వక వాతావరణం ప్రదర్శించారని వివరించింది. ఈ ఒప్పందం తర్వాత దాదాపు $2 బిలియన్ల విలువైన అధునాతన ఆయుధాలు మరియు ఇంటెలిజెన్స్ గేర్‌ల ప్యాకేజీని భారత్ కు ఆ దేశం అమ్మినట్టుగా తెలిపింది. ఈ రెండు దేశాల్లో పెగాసస్ మరియు క్షిపణి వ్యవస్థ బలంగా ఉన్నాయని వివరించింది.
పెగాసస్ స్పైవేర్ నుండి ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన లాభాలను పొందినట్టుగా ప్రస్తావించింది. ఆ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత ఆ దేశ ప్రధాని నెతన్యాహు భారతదేశానికి వచ్చారని పేర్కొంది. ఇక ఆ తర్వాత భారత్ ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఓటు కూడా వేసిందని గుర్తు చేసింది. ఈ పెగాసస్ ద్వారా మంత్రులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు మరియు పాత్రికేయులు, సహా పలువురు ఫోన్ లను హ్యాక్ చేశారని ఆరోపణలు వచ్చాయి.
వాస్తవానికి ఇజ్రాయెల్ దీనిని ఉగ్రవాదుల కోసం వాడేది. ఇక దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల కీలక నేతలు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని ఆయన మండిపడ్డారు. మోడీ ఇప్పటికి అయినా నిజం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికారపక్షంలో ఉన్న వారిని ప్రతిపక్షం, న్యాయస్థానాన్ని టార్గెట్ చేసి వారి ఫోన్‌లను ట్యాప్ చేసినట్టు మండిపడ్డారు. ఇది ఖచ్చితంగా దేశద్రోహం కిందకే వస్తుందని… మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడింది అని ఆరోపించారు. కాగా దీనిపై సుప్రీంకోర్ట్ లో విచారణ జరగగా… సుప్రీంకోర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read : యూపీ ఎన్నికల ప్రచారంలో హోరెత్తుతున్న పాకిస్తాన్,జిన్నా పేర్లు