iDreamPost
iDreamPost
జూనియర్ ఎన్టీఆర్ ని తెరమీద చూసి మూడేళ్లు దాటేసింది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత నేరుగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని ఒప్పుకోవడంతో ఈ గ్యాప్ తప్పలేదు. ఇంచుమించు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సైతం ఈ ఎడబాటు తప్పలేదు కానీ తనని నెల రోజుల గ్యాప్ లో రెండు సార్లు చూస్తారు ఆచార్యతో కలిపి. అందుకే ట్రిపులార్ మీద యంగ్ టైగర్ అభిమానుల అంచనాలు మాములుగా లేవు. జనవరి 7న విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ తాలూకు ట్రైలర్ డిసెంబర్ 5న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధిగా రావడం దాదాపుగా ఖరారైనట్టే.
ఇక తారక్ కూడా మెల్లగా ప్రమోషన్లు ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశాడు. ఇటీవలే ఒక జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ముఖాముఖీలో పలు ఆసక్తికరమైన విశేషాలు చెప్పాడు. అందరిని ఊపేసిన నాటు నాటు పాట కోసం ఇద్దరు హీరోల మధ్య సింక్ పర్ఫెక్ట్ గా కుదిరేందుకు జక్కన్న 18 దాకా టేకులు తీసుకున్నాడని, అంతగా తపించిపోతాడు కాబట్టే ఈ స్థాయికి చేరుకున్నాడని పేర్కొన్నాడు. టాలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్స్ పేరున్న తారక్ చరణ్ లకే ఇన్ని రీ టేకులు అంటే ఇక మిగిలినవాళ్లుకు పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. మొత్తానికి ఈ మాటల ద్వారా నాటు నాటు మీద అంచనాలు మరింత రెట్టింపు చేశాడు జూనియర్
ఇక కొరటాల శివతో చేయబోయే సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుని కూడా కన్ఫర్మ్ చేశాడు. 2022 అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని, కెజిఎఫ్ స్కేల్ లోనే దానికి మించేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడని చెప్పి ఊరింపుని రెట్టింపు చేశాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్ళ కాలం ఖర్చు పెట్టిన తారక్ మరి ఇప్పుడు ప్రశాంత్ సినిమా కోసం ఎంత సమయం కేటాయిస్తాడో చూడాలి. ప్రభాస్ సలార్ ని వేగంగానే పూర్తి చేస్తున్న ప్రశాంత్ నీల్ దీన్ని కూడా అదే తరహాలో ఎక్కువ ఆలస్యం చేయకపోవచ్చు. నెక్స్ట్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ అంత ఆలస్యం ఇకపై ఉండకపోవచ్చు
Also Read : Garuda Gamana Vrishabha Vahana : సంచలనం రేపుతున్న కన్నడ సినిమా