Idream media
Idream media
మా జనరేషన్ వాళ్లందరికీ NTR ఒక అద్భుతం, మరిచిపోలేని జ్ఞాపకం. బాల్యం, యవ్వనం ఆయన నీడ కిందే నడిచాయి. ఊహ వచ్చే సరికి మా పల్లెలో (చీమలవాగుపల్లె, తాడిపత్రి దగ్గర) ఇంటి లోపలి గోడకి కృష్ణార్జునయుద్ధం పోస్టర్ వుండేది. యాడికి నుంచి మా చిన్నాన్న తెచ్చి అతికించాడు. కృష్ణుడిగా NTR , అర్జునుడిగా ANR బొమ్మలుండేవి. NTRని చూసిన మొదటి జ్ఞాపకం.
ఆరేళ్ల వయస్సులో బళ్లారికి పెళ్లికి వెళ్లాను. రాయల్ టాకీస్‌లో వరకట్నం చూశాను. NTR విలన్‌ని తంతే, వాడు మేడ దూకి పారిపోవడం గుర్తుంది. తర్వాత NTRని వదల్లేదు. ప్రతి సినిమా చూశాను. మిస్ అయిన సినిమాల్ని ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తూ వుంటాను. రాజులు , యుద్ధాలు, మంత్రతంత్రాలు, రామాయణ భారతాలు అన్నీ పరిచయం చేసింది ఆయన సినిమాలే. అప్పట్లో తిరుపతి టూర్ వెళ్లే యాత్రికుల్ని మద్రాస్ కూడా తీసుకెళ్లి NTRని చూపించే వాళ్లు. అలా చూసిన వాళ్లని నేను ఆరాధనగా అసూయగా చూసేవాన్ని. ఒకటికి పదిసార్లు విసిగించి మరీ అడిగేవాన్ని. NTR మేకప్ లేకుండా , ఇంటి దగ్గర ఎలా వుంటాడని.
Also Read:ఎన్టీఆర్ చివరి ఘట్టం- అల్లుడుగారు చెబుతున్న నిజా నిజాలు
1972 తర్వాత NTR బోర్ కొట్టసాగాడు. గన్ పట్టుకుని కృష్ణ ఎడాపెడా కాలుస్తున్న రోజులు. శోభన్ ప్రేమ కథలు నడుస్తున్న కాలం. ఎంత బోర్ కొట్టినా NTR సినిమా చూడకపోతే నేరం అనుకునేవాన్ని. డౌన్ అవుతున్నాడనుకున్నప్పుడు మళ్లీ జెట్ స్పీడ్‌తో పైకి లేవడం ఆయన స్పెషాలిటీ. దానవీరశూరకర్ణతో ఒక ఛాలెంజ్ విసిరాడు. పౌరాణికాల్లో తనతో సమానం ఎవరూ లేరని. డైలాగ్‌లు LP రికార్డుగా రావడం తెలుగులో అదే మొదలు. నాలుగు నెలల గ్యాప్‌లో అడవిరాముడు, ఆల్‌టైమ్ హిట్. ఆరేసుకోబోయి పారేసుకో అంటే జనం కాయిన్స్ విసిరారు. యమగోలలో పిచ్చి డ్యాన్స్‌లు చేసినా సహించారు. సర్దార్‌పాపారాయుడు, జస్టిస్ చౌదరి ఇవన్నీ పీక్. సర్కస్‌రాముడు, సూపర్ మ్యాన్ లాంటి చెత్త తీయడం కూడా ఆయనకే సాధ్యం. రాజపుత్ర రహస్యంలో NTRని ఆ వయసులో టార్జన్‌గా చూశామంటే అది మామూలు సహనం కాదు. ఆయన్ని చాలా వాటికి ప్రేమించడమే కాదు , క్షమించారు కూడా.
1983లో NTR అనంతపురం వస్తే మనుషులే తప్ప నేల కనపడలేదు. గోతులే తప్ప రోడ్లు లేని కాలంలో చైతన్య రథం ఎలా నడిచిందో డ్రైవర్ స్వర్గీయ హరికృష్ణకే తెలియాలి. అభ్యర్థుల మొహాలు కూడా చూడలేదు. NTRనే చూశారు. 84లో నాదెండ్ల తిరుగుబాటు. అనంతపురం ఒక రణరంగం. Old town పోస్టాఫీస్‌కి నిప్పు పెట్టారని , అది చూడడానికి యువకులు మేము వెళ్లాం. పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. శవాల్ని కూడా లెక్క చేయకుండా గొడవలు.
కాంగ్రెస్ ఆఫీస్‌కి నిప్పు పెట్టారు. లేపాక్షి ఎంపోరియం ధ్వంసం. సూపర్ బజార్ లూటీ. ఆందోళనకారులు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియదు. రోడ్లన్నీ బండరాళ్లు పగిలిపోయిన చెత్త కుండీలతో నిండిపోయాయి. తెల్లారేసరికి CRP దిగింది. జనం కనిపిస్తే చితకబాదారు. కరోనా కంటే అన్యాయం రోజులు.
NTR మళ్లీ ముఖ్యమంత్రి. అందరూ సంబరం. 85లో బ్రహ్మాండమైన గెలుపు. జనం అభిమానం చూసి NTRకి మతిపోయింది. అన్నీ మతిలేని పనులే చేశారు. 88లో ఓడించారు. ఇక రాడనుకున్నారు. మేజర్‌చంద్రకాంత్‌గా వచ్చాడు.
Also Read:మరో నెల రోజులు లాక్‌డౌన్.. కేంద్రం సంకేతాలు
తిరుపతిలో శతదినోత్సవం. బ్రహ్మాండమైన ఊరేగింపు. నేను నగ్మాని చూడాలని వెళ్లాను. NTR ముందు ఆమె ఆనలేదు. NTRనే చూశాను. ఆయన ఆకర్షణ అది. ఆ రోజు ఆంధ్రజ్యోతిలో నైట్ షిప్ట్. వేడుకల వార్త కోసం ఎదురు చూస్తూ వుంటే బ్రేకింగ్ న్యూస్ లక్ష్మీపార్వతి.
1994 ఎన్నికల ప్రచారానికి దంపతులిద్దరూ వచ్చారు. తిరుపతిలో జన ప్రభంజనం. నాయకుల సంగతేమోగానీ, జనం మాత్రం ఇద్దరినీ సమానంగా ఆదరించారు, గౌరవించారు.
తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాజకీయంగా NTR పనులు మనకు చాలా నచ్చకపోవచ్చు. సినిమాలు కూడా అన్నీ నచ్చకపోవచ్చు. కానీ ఆయన వ్యక్తిత్వం, పట్టుదల అసాధారణమైనవి.
కవచకుండలాలు ఇవ్వనని కర్ణుడు మాట తప్పితే భారతం ఇంకోలా వుండేది. పురాణ పాత్రల నటనే కాదు, లక్షణాలు కూడా NTRలో వున్నాయి. లక్ష్మీపార్వతిని ఇకపై రాజకీయాలకు దూరం పెడతానని ఒక మాట అంటే పదవి వుండేది. రాజకీయాలు ఇంకోలా వుండేవి. కానీ ఆయన అనలేదు. ఆమె నా భార్య, అర్ధాంగి, జీవితంలో సగం అనే అన్నాడు. పదవి కంటే కూడా ఆమెకి ఇచ్చిన గౌరవం గొప్పది.
Also Read:నటసార్వభౌముడికి గౌరవం దక్కేనా
ఒక తెల్లవారుజామున తిరుపతిలో వాకింగ్ వెళుతుంటే దూరంగా షామియానా కనిపించింది. దగ్గరికెళితే NTR ఫొటో. ఏదో బాధ, ఆప్తున్ని కోల్పోయిన దుక్కం. ఇంటికొచ్చి చాలా సేపు నిశ్శబ్దంగా వుండిపోయాను.
ఇప్పటికీ ఆయన సినిమాలు చూస్తూనే వుంటాను. జర్నలిస్టుగా చాలా ఏళ్లు ఆయన వార్తలు రాశాను, ఎడిట్ చేశాను. ఆయన వెళ్లిపోయి చాలా ఏళ్లైంది. జ్ఞాపకాల్లోంచి ఎప్పటికీ వెళ్లిపోడు. మనసు తెరపై శాశ్వతంగా వుంటాడు.