iDreamPost
android-app
ios-app

జగన్ ను తప్పుగా అర్థం చేసుకున్నామా? ఆ సామాజిక వర్గంలో ఆలోచన 

  • Published Jan 29, 2022 | 12:34 AM Updated Updated Jan 29, 2022 | 12:34 AM
జగన్ ను తప్పుగా అర్థం చేసుకున్నామా? ఆ సామాజిక వర్గంలో ఆలోచన 

“జగన్మోహన్ రెడ్డిని తప్పుగా అర్థం చేసుకున్నామా?” అనే ఆలోచన తెలుగుదేశం పార్టీని బలపరిచే సామాజిక వర్గంలో మొదలయింది. కొందరు పెద్దలు ఇప్పటికే గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడాన్ని, ద్వేషించడాన్ని  అంగీకరించడం లేదు. ఇప్పటి వరకూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఎలా చెపితే జగన్మోహన్ రెడ్డిని అలాగే అర్థం చేసుకున్నారు ఆ సామాజికవర్గం ప్రజలు. యువత, అలాగే ఎన్నారైలు కూడా ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెపితే అదే నిజమని ఎక్కువమంది నమ్మారు. వారు ఇప్పటికీ చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ చెప్పిందే నిజం అనే భ్రమల్లో ఎక్కువమంది ఉన్నారు. 

అయితే ఇప్పుడు ఆ సామాజికవర్గం ప్రజల్లో సరికొత్త ఆలోచన మొదలయినట్టు కనిపిస్తోంది. ప్రత్యేకించి విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు నిర్ణయించడాన్ని ఆ సామాజికవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేశారు. ఉగాది నుండి కొత్త జిల్లాలు అధికారికంగా పనిచేయడం మొదలుపెడతాయి. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చిన్న విషయం ఏమీ కాదు. శాశ్వతంగా ఎన్టీఆర్ పేరు నిలబడిపోతుంది. నిత్యం ప్రజల నోట్లో నానుతుంది. 

పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఈ దిశగా ఎన్నడూ ఆలోచన చేయలేదు. నెల్లూరుకు శ్రీ పొట్టిశ్రీరాములు పేరు, కడప జిల్లాకు వైఎస్సార్ పేరు ఓ దశాబ్దం క్రితమే ఖరారు అయ్యాయి. ఆ తర్వాత, ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు లేదా కొత్తగా అమరావతి రాజధాని ప్రాంతంగా ప్రకటించి దాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి దానికి ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం వచ్చినా చంద్రబాబు ఆ పని చేయలేదు.

పైగా 2019 ఎన్నికలకు ముందు ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరు తొలగించాలని ఆలోచిస్తున్నట్టు కూడా ఒక అనధికార ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇకపై ఎన్టీఆర్ పేరు వాడేది లేదు అని కూడా ప్రకటించారు. బహుశా 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే ఆరోగ్యశ్రీ ఒక్కటే కాదు అనేక పథకాల నుండి ఎన్టీఆర్ పేరు తొలగించి వేసేవారు. అలాంటి పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేశారు. 

Also Read : సక్రమంగా స్పందిస్తే చంద్రబాబు ఎందుకవుతారు?

ఈ నిర్ణయం సరికొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. మొదటిసారిగా టీడీపీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో పాటు ఉత్తరాంధ్రలో ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు, తిరుపతికి బాలాజీ పేరు, పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు సత్యసాయి పేరు ఖరారు చేయడాన్ని కూడా చర్చిస్తున్నారు. “జగన్మోహన్ రెడ్డి కమ్మ కులానికి వ్యతిరేకం అనుకున్నాం. కానీ విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి తాను వ్యతిరేకి కాదు అని నిరూపించారు.

అలాగే జగన్మోహన్ రెడ్డి హిందూ మత వ్యతిరేకి అనుకున్నాం. కానీ రెండు జిల్లాలకు హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టి తాను హిందూ వ్యతిరేకిని కాదు అని నిరూపించుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని మేము సరిగా అర్థం చేసుకోలేదా అనే ఆలోచన వస్తోంది. ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ ఎలా చెపితే అలానే ఆలోచించాం. వారి మాటల్లోనే జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకున్నాం. కానీ అది తప్పు అని అనిపిస్తోంది,” అంటూ కొందరు ఆ సామాజిక వర్గం నేతలు తమ మిత్రుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. 

అలాగే విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండాను రెపరెపలాడించారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని స్వాగతించి ముఖ్యమంత్రిని అభినందించారు.

ఇవన్నీ టీడీపీ అనుకూల సామాజిక వర్గంలో కొత్త ఆలోచనలకు బలాన్ని ఇచ్చాయి. కొందరు చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ కళ్ళలోనుంచి కాకుండా తమ కళ్ళతో జగన్మోహన్ రెడ్డిని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది శుభపరిణామం.  

Also Read : ఆ బ్లడ్, ఆ బ్రీడ్ నోరు విప్పలేదే!?