Idream media
Idream media
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. సచివాలయం కూల్చివేత పర్యావరణానికి సంబంధించిన విషయం అయినందువల్ల ఎన్జీటీలో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖలను ప్రతివాదులుగా చేర్చారు. పర్యావరణ అనుమతులు రాకుండానే కూల్చివేస్తున్నారని ఆరోపించారు.
అయితే, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. హైకోర్టులో విచారణ తరువాత వాదనలు వింటామని చెప్పింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మరోవైపు పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయంలోని భవనాల కూల్చివేతను చేపట్టడానికి వీల్లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. భవనాల కూల్చివేత పనులపై మధ్యంతర స్టే ఆదేశాలను హైకోర్టు గురువారానికి పొడిగించింది. ఈ మేరకు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ వాదనలకు బలం చేకూర్చే తీర్పులను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాపించిన తరుణంలో నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు సంబంధించి 4(3)వ నియమానికి వ్యతిరేకంగా సచివాలయ భవనాలు కూల్చివేతలు చేపట్టారని, వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ పిఎల్ విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
జిహెచ్‌ఎంసి నుంచి అనుమతులు పొందకుండానే ప్రభుత్వం కూల్చివేతలు చేపట్టిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సిహెచ్. ప్రభాకర్ గత విచారణలో పేర్కొనగా, బుధవారం మరో వాదనను తెరపైకి తెచ్చారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం 2006 సెప్టెంబరు 14న పర్యావరణ ప్రభావిత అంచనా నోటిఫికేషన్ జారీచేశారని, దీని ప్రకారం పర్యావరణ అనుమతులు విధిగా తీసుకోవాలని ఆయన అన్నారు.
దీనిపై ఈ హైకోర్టు, సుప్రీం కోర్టు గతంలో పలు తీర్పులు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. కూల్చివేతలకు, ఆ తర్వాత చేపట్టే నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు సంబంధిత రెగ్యులేటరీ అథార్టీ నుంచి పొందాల్సి ఉందని ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ వాదనలపై స్పందించిన సిజె.. పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారం భూమిని చదును చేయడానికి అనుమతులు పొందాల్సి ఉందని ఏజి బిఎస్ ప్రసాద్‌కు చెప్పారు. పర్యావరణ అనుమతులు లేకపోతే భూమిని చదును చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలను ఎజి బిఎస్ ప్రసాద్ వ్యతిరేకించారు. ఈ దశలో పర్యావరణ అనుమతులు అవసరం లేదన్నారు. కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం జిహెచ్‌ఎంసి నుంచి అనుమతులు పొందిందని, వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను సమర్పించినట్లు ఆయన తెలిపారు. అవసరమైన అనుమతులు పొందినందున కూల్చివేతపై స్టే ఆదేశాలు తొలగించాలని ఏజీ కోరారు. ఇప్పటికే చాలా బ్లాకులు కూల్చివేశామని, పాక్షికంగా కూల్చివేసిన బ్లాకులు శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఆయన చెప్పారు.
అలాంటి అనుమతులు కొత్తగా తలపెట్టిన సమీకృత సచివాలయ భవనానికి అవసరమన్నారు. ‘’నిర్మాణ కార్యకలాపాలు-భూమిని సిద్ధం చేయడం’’ అనే పదాలను కలిపి చదవాలన్నారు. ‘‘భూమిని సిద్ధం చేయడం అంటే… ఇప్పటికే ఉన్న భవనాన్ని కూల్చి పునాదిని తవ్వి నిర్మాణాన్ని ప్రారంభించడం అని అర్థం. భూమి సన్నాహాలు అంటే…భవిష్యత్‌లో నిర్మాణం చేసే ఉద్దేశంతో భూమిని చదును చేయడం’’ అని ఏజీ వివరించారు.
దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుని ‘‘ప్రభుత్వం కూల్చివేతలు చేపట్టింది. పర్యావరణ చట్ట ప్రకారం తగిన అనుమతులు లేకుండా కూల్చివేతలు కొనసాగించడానికి వీల్లేదు. సంబంధిత అథార్టీ నుంచి పర్యావరణ అనుమతులు పొందాల్సిందే. అంతవరకు కూల్చివేతలు చేపట్టరాదు. తగిన అనుమతులు పొందిన తర్వాతే నూతన సచివాలయ భవనం కోసం భూమిని సిద్ధం చేయాల్సి ఉంటుంది’’ అని ఎజి బిఎస్ ప్రసాద్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
సచివాలయ ఆవరణలోని జామియా, హాష్మీ మసీదులను అక్కడే విశాలంగా నిర్మిస్తామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ వివరణపై స్పందించిన హైకోర్టు ఇదే అంశాన్ని మౌఖికంగా కాకుండా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. సచివాలయ ఆవరణలోని జామియా, హాష్మీ మసీదులను కూల్చివేయడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది ఎం.జాకిర్ హుసేన్ జావిద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి ముందు విచారణకు వచ్చింది.