iDreamPost
android-app
ios-app

ప్రజాతీర్పునకు ఇదేనా గౌరవం..?

  • Published Oct 31, 2020 | 4:28 AM Updated Updated Oct 31, 2020 | 4:28 AM
ప్రజాతీర్పునకు ఇదేనా గౌరవం..?

1) ప్రజలు

2) ప్రజల కోసం ఏర్పాటైన రాజ్యాంగబద్ద సంస్థ..

ఈ రెండిటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది? అన్న ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పడం కష్టం.

కానీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో అంతిమంగా ప్రజాప్రయోజనానికే ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. భిన్న పరిస్థితులు, విభిన్న సమయాల్లో ఇందుకు అతీతంగా వ్యవహరించిన వారు కొద్దికాలం వారి మాట నెగ్గితే నెగ్గొచ్చుగాక. కానీ చరిత్రంలో చీకటి అధ్యాయం అటువంటి వ్యక్తుల పేరిట రాసేస్తారు ప్రజలు. తమదైన ఒక రోజు వచ్చినప్పుడు తప్పకుండా తగు విధంగా అటువంటివారిని ప్రజలు తగిన విధంగా ‘గౌరవిస్తారు’. ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటికే అనేకసార్లు ఇది నిరూపితమైంది కూడా. రాజకీయ కారణాలు ఎన్నైనా ఉండొచ్చు గాక. కానీ ప్రజలను గురించి ఆలోచించాల్సిన ప్రాధాన్యం ఎంతైనా ఉంటుంది.

ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశాలో ఒకటిగా నిలుస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలి. చేసే ప్రతిపని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తోందన్నది అధికార వైఎస్సార్‌సీపీ ప్రధానంగా ఎత్తిచూపుతోంది. దీనికి వివరణ ఇచ్చుకోవడం మాట అటుంచితే, కనీసం సమాధానం కూడా చెప్పడం లేదని వారు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజిష్టరైన అన్ని రాజకీయ పార్టీలతోనూ ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి అధికార వైఎస్సార్‌సీపీ హాజరు కాలేదు. మిగిలిన పలు పార్టీలు హాజరై తమతమ అభిప్రాయాలను తెలియజేసాయి.

అయితే రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 51శాతం ఓట్లతో అధికారంలోకొచ్చిన పార్టీ ప్రాతినిధ్యం లేకుండా ఒక సమావేశం జరగడం, ఆ సమావేశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించడం ఎంత వరకు ‘నిబంధనల’లకు లోబడే పరిగణనలోకి తీసుకోవాలి అన్న ప్రశ్న ప్రజల మెదళ్ళలో ఉద్భవిస్తోంది. మెజార్టీ ప్రజలు ఎన్నుకున్న పార్టీదే అధికారం. ఎక్కువ మంది ఎంపిక చేసుకున్న ప్రభుత్వం అధికారంలోకొస్తుంది. అంటే సదరు ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు ఏ సంస్థ అయినా జవాబుదారీగా ఉండాల్సిందే. ఈ లెక్కన 51శాతం ఓట్లు పొందిన వైఎస్సార్‌సీపీ మినహా మిగిలిన పార్టీల అభిప్రాయాలను మాత్రమే నమోదు చేసుకోవడం ఎంత వరకు భావ్యం.

ఇదే కాదూ.. ప్రజలు, నిబంధనలు ఇత్యాధి వాటిని గురించి మేం పట్టించుకోం.. మాకు చెందిన ప్రభుత్వం లేదు కాబట్టి, ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే మా లక్ష్యం అన్నరీతిలోనే జరిగే ప్రతిచర్య ఉండడాన్ని ప్రజలు గమనించడం లేదనుకోవడం అవివేకమే అవుతుంది. 2019లో అధికారం పోయిన తరువాత ‘సాంకేతిక’ అంశాలను మాత్రమే అడ్డం పెట్టుకుని పాలనకు అడ్డంకులుగా వ్యవహరిస్తున్నారన్న నిందను ఇప్పటికే మోస్తున్నారు. ఇదే సాంకేతికత కోసం ఎన్నికల కమిషన్‌ ఈ సమావేశాన్ని కూడా ఉపయోగించుకున్నారన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కూడా.

ఇందుకు ఏపీలో ఉనికిలో లేని పార్టీలను కూడా సమావేశానికి పిలిచి ‘ఎక్కువ పార్టీల అభిప్రాయం’గా కలరింగ్‌ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని చెబుతున్నారు. నిజానిజాలు ఆయా పార్టీల నాయకులకే ఎరుక. వాస్తవాన్ని బైటకు తేగలిగే శక్తి ఒక్క కాలానికి మాత్రమే ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్నవి, అనుకుంటున్నవీ అన్నీ ఇప్పటికిప్పుడు అభిప్రాయంగానే ఉండొచ్చు. తరువాత ఇవే నిజం కూడా కావొచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వేదికగా ప్రజల ముందుకు రాబోయే ‘సాంకేతిక’ ప్రదర్శను మున్ముందు చూడాల్సిందే.