Idream media
Idream media
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బీజేపీ-జనసేన పార్టీలకు ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకు కలిసి ఒకే ఒక అభ్యర్థి గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఏదో తృటిలో అధికారం కోల్పోయాం.. ఈ ఉప ఎన్నికలో గెలిచి తమ సత్తా చూపిస్తాం అన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నాయి.
ఆడ లేక మద్దెలదరువు అన్న చందంగా తయారైంది వీరి పరిస్థితి. ఉప ఎన్నికలో ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియకపోవడంతో నోటిఫికేషన్నే రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు జీవీఎల్, సుజనా, సీఎం రమేష్, సునీల్ దేవధర్ తో కలిసి జనసేన నేత నాదెండ్ల మనోహర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేయడం విడ్డూరంగా ఉంది.
స్థానిక సంస్థల ఫలితాలు ఉప ఎన్నికపై పడే అవకాశం ఉందని ఈ నాయకులు సీఈసీ వద్ద మొరపెట్టుకున్నారు. ఇంతకంటే అమాయకత్వం ఉందా..? జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గతేడాది మార్చిలోనే నోటిఫికేషన్ విడుదలై, కరోనా కారణంగా పోలింగ్ వాయిదా పడింది. అదే నోటిఫికేషన్నే ప్రస్తుత ఎస్ఈసీ కంటిన్యూ చేసింది. ఈ ఫలితాలు10న వెలువడతాయని, ఆ ప్రభావం ఉప ఎన్నికపై పడుతుందట .. అందుకే బై ఎలెక్షన్ నోటిఫికేషన్ రద్దు చేసి .. మళ్లీ తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలంటా..!
అర్థం పర్థం లేకుండా బీజేపీ-జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణల వల్ల ఇప్పటికే అబాసుపాలయ్యారు. ఒకసారి అయితే సరిపోదు.. ప్రతిసారీ కావాలనే ఉద్దేశంతోనే ఈ నాయకులు ఇలా ప్రవర్తిస్తున్నారా అన్న సందేహం సర్వత్రా కలుగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో లవశేషం మాత్రం కూడా సీట్లు గెలవలేని ఈ రెండు పార్టీలు… 10న వెళ్లడయ్యే స్థానిక సంస్థల ఫలితాలు ఉప ఎన్నికపై ప్రభావం చూపిస్తాయని చెబుతూ ఉండడంతో ఓటమిని ముందే అంగీకరించి.. దానికి తగ్గ కారణాలను ఇప్పటి నుంచే ప్రచారం చేసుకునే పనిలో ఉన్నట్లుంది.
మరోవైపు నవతరం అభ్యర్థికి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుని వెనక్కి తీసుకోవాలని కూడా సీఈసీకి వీరు విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి చూస్తే ఎన్నికల నిబంధనలపై వీరికి కనీస అవగాహన లేనట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఉప ఎన్నికలో జనసేన బరిలో లేదు… అదేమో రిజిష్టర్డ్ పార్టీయే కానీ, రికగ్నైజ్డ్ పార్టీ కాదు… రికగ్నైజ్ పార్టీ కావాలంటే నిర్ణీత శాతాల్లో వోట్లు సంపాదించి ఉండాలి… ఆ లెక్కల్లో జనసేన ఇంకా ఫిట్ కాలేదు… సో, దానికి ఇంకా గుర్తింపు రాలేదు. గుర్తింపు దక్కి ఉండాలంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు…. చెల్లిన వోట్లలో 6 శాతం వచ్చి ఉండాలి. లేదా కనీసం రెండు సీట్లు గెలిచి ఉండాలి. మొత్తం సీట్లలో 3 శాతం గెలిచి ఉండాలి. లేదా మొత్తం వోట్లలో 8 శాతం సాధించి ఉండాలి… అవేవీ జరగలేదు కాబట్టి జనసేనకు గుర్తింపు దక్కలేదు. దాంతో దానికి ఇన్నిరోజులూ కేటాయిస్తున్న గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది. ఫ్రీ సింబల్ కాబట్టి ఏ అభ్యర్థయినా తమకు కేటాయించాలని అడగొచ్చు. నిరాకరించే అవకాశం ఎన్నికల అధికారులకు కూడా ఉండదు.
జనసేన బరిలో ఉండి ఉంటే, ఆ పార్టీకే గాజు గ్లాసు కేటాయించేవాళ్లు. కానీ, అది పోటీలో లేదు. నవతరం కూడా రిజిష్టర్డ్ పార్టీయే. వాళ్లు అడిగితే ఫ్రీ సింబల్‌గా ఉన్న గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం తిరస్కరించడానికి వీల్లేదు. ఇప్పటికే గుర్తులు కేటాయించిన నేపథ్యంలో మళ్లీ వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ జోక్యంతో గుర్తుని వెనక్కి తీసుకొని కొత్త గుర్తు ఇస్తే .. సీఈసీ నిర్ణయాన్ని ఆ అభ్యర్థి కోర్టులో సవాల్ చేయొచ్చు. సో, అంతిమంగా బీజేపీ-జనసేన నాయకులు ఉనికి కోసం పడుతున్న పాట్లు వారినే నవ్వుల పాలు చేస్తున్నాయి.