iDreamPost
android-app
ios-app

Nellore Corporation Elections – సింహపురి పోరు.. ఈ సారి ఏం జరగబోతోంది..?

Nellore Corporation Elections – సింహపురి పోరు..  ఈ సారి ఏం జరగబోతోంది..?

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. డివిజన్ల హద్దులు, డివిజన్ల మధ్య ఓట్ల సంఖ్యలో వ్యత్యాసాలు వంటి సమస్యలు పరిష్కారం కావడంతో ఎట్టకేలకు కార్పొరేషన్‌ ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 6వ తేదీన పరిశీలన, 8వ తేదీన ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 15వ తేదీన పోలింగ్‌ జరగనుంది. 16వ తేదీన ఎక్కడైన అవసరమైతే రీ పోలింగ్‌ నిర్వహిస్తారు. 17వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు.

ఇదీ సింహపురి చరిత్ర..

దాదాపు 120 సంవత్సరాలపాటు మున్సిపాలిటీగా ఉన్న నెల్లూరు 2004లో కార్పొరేషన్‌గా మారింది. కొన్నేళ్లు ప్రత్యేక అధికారి పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ మేయర్‌ పీఠాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మరికొన్నేళ్లు కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారి పాలన నడిచింది.

రెండో దఫా 2014లో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది. టీడీపీ అధికారంలో ఉంది. వైసీపీ నెల్లూరు నగర, సిటీ అసెంబ్లీలను గెలుచుకుని బలంగా మారింది. మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ ఉనికి అక్కడక్కడా కనిపిస్తోంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో జరిగిన నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎవరు మేయర్‌ పీఠాన్ని గెలుచుకుంటారనే ఉత్కంఠ నాడు నెలకొంది.

54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌లో మేయర్‌ పీఠం దక్కాలంటే 28 మంది కార్పొరేటర్లు అవసరం. పోలింగ్‌ ముగిసిన తర్వాత అంచనాలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదనేలా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ రెండూ.. మేజిక్‌ ఫిగర్‌కు రెండు, మూడు సీట్ల దూరంలో నిలిచిపోతాయనే ఊహాగానాలు సాగాయి. అయితే లెక్కింపు తర్వాత సీన్‌ మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ తన పట్టును నిలుపుకుంది. 54 డివిజన్లకు గాను 31 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 15 డివిజన్లలో టీడీపీ, బీజేపీ రెండు చోట్ల గెలుపొందాయి. మిగతా 6 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ఎవరి మద్ధతు లేకుండా మేయర్‌ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.

Also Read : Badvel Bypoll : 30 వేల దొంగ ఓట్లా..? ఆరోపిస్తే అర్థముండాలి వీర్రాజు..!

ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలో టీడీపీ ఉండడంతో.. మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకునే యత్నాలను ఆరంభించింది. వైసీపీ కార్పొరేటర్లకు వల వేసే ప్రయత్నాలు చేసింది. ప్రలోభాలకు తెరతీసింది. ఒకానొక దశలో మేయర్‌పీఠం టీడీపీ గెలుచుకోబోతోందనే ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే వైసీపీ కార్పొరేటర్లు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకపోవడంతో టీడీపీ ప్రలోభాల రాజకీయం విఫలమైంది.

31 మంది కార్పొరేటర్లతో నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ పాలక వర్గం ఏర్పాటైంది. నెల్లూరు నగర రెండో మేయర్‌గా అబ్ధుల్‌ అజీజ్‌ ఎంపికయ్యారు. బలం లేకపోయినా.. ప్రలోభాల ద్వారా వలసలు ప్రోత్సహించి మేయర్‌ పీఠాన్ని గెలుచుకోవాలని విఫలయత్నం చేసిన టీడీపీ.. వైసీపీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత కూడా ఆ పనిని చాపకింద నీరులా సాగించింది.

అధికార బలంతో టీడీపీ ఏకంగా మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌పై దృష్టి క్రేందీకరించింది. ఆక్వా వ్యాపారి అయిన అబ్ధుల్‌ అజీజ్‌కు వల వేసింది. కొద్ది నెలలకే టీడీపీ నేత, నాటి పట్టణ, పురపాలక మంత్రి పి.నారాయణ ప్రయత్నాలు ఫలించాయి. అబ్ధుల్‌ అజీజ్‌ పలువురు కార్పొరేటర్లతో కలసి 2014 ఆగస్టులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

ఇక ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే వైసీపీనే సింహపురి మేయర్‌ పీఠాన్ని గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీకి ఆది నుంచి పట్టుఉండడమే కాకుండా గడిచిన రెండున్నరేళ్లలో జగన్‌ సర్కార్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి లాభించనున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి చుక్కానిలేని నావ మాదిరిగా తయారైంది. జిల్లాలో, ముఖ్యంగా నగరంలో ప్రధాన నేత అయిన మాజీ మంత్రి పి. నారాయణ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన యాక్టివ్‌ అవుతారా..? అనేది సందేహమే. మాజీ మేయర్, గత ఎన్నికల్లో రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆజీజ్‌ టీడీపీ బాధ్యతలు మోయాల్సి రావచ్చు. మొత్తం మీద 54 డివిజన్లలో టీడీపీ ఎన్ని డివిజన్లు గెలుచుకుంటుందనేదే ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశం.

Also Read : Election Notification – మినీ స్థానిక పోరుకు నగారా మోగింది