iDreamPost
android-app
ios-app

పరువు తీసేస్తున్న ‘నోటా’

  • Published Nov 17, 2020 | 4:11 AM Updated Updated Nov 17, 2020 | 4:11 AM
పరువు తీసేస్తున్న ‘నోటా’

అయిదేళ్ళ కోసారి ఓటు వేసే అవకాశం వస్తుంది. అలా వచ్చినప్పుడు బ్యాలెట్‌ పేపర్‌పై ఉన్న అభ్యర్ధుల్లో ఎవరో ఒకరికి ఓటు వేసి హమ్మయ్య ఓటును సద్వినియోగం చేసేసుకున్నాం అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ సదరు అభ్యర్ధులు ఎవ్వరూ నచ్చకపోతే.. అప్పుడు వేరే ఆప్షన్‌లేక ఉన్న వాళ్ళలో ఎక్కువ నచ్చినోళ్ళకే వేసేసి ఊరుకునే వారు.

కానీ 2013 నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. బ్యాలెట్‌ పేపర్‌లో నోటా (నన్‌ ఆఫ్‌ ది అబౌ)ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఇది ఓటరు యొక్క ఓటు హక్కులో స్వేచ్ఛను ప్రతిబింభిస్తోందని చెబుతారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఉన్న అభ్యర్ధులెవ్వరూ నచ్చకపోతే ఈ నోటా ఆప్షన్‌ను ఓటరు ఎంచుకుని, దానికి ఓటు చేయొచ్చు. తద్వారా అభ్యర్ధుల ఎంపికపై ఆయా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుందన్న మాట.

అయితే ఇప్పుడు ఈ నోటా పలు జాతీయ పార్టీల పరువును బ్యాలెట్‌ పేపర్‌పై నిలబెడుతోంది. సదరు పార్టీలు నిలబెట్టిన అభ్యర్ధులకంటే ఈ నోటాకే ఎక్కువ ఓట్లు పోలవుతుండడాన్ని గత కొన్ని ఎన్నికల్లో పరిశీలకులు గుర్తించారు. అంటే ఇక్కడ జాతీయ పార్టీలే అయినప్పటికీ వారు నిలబెట్టిన అభ్యర్ధులను ప్రజలకు ఏ మాత్రం నచ్చడం లేదన్నది తేలిపోతోందంటున్నారు. ఒక వేళ నోటా లేకపోయి ఉంటే ఆ అవకాశం ఉండేది కాదని వివరిస్తున్నారు.

2019 ఎన్నికల్లో పలు జాతీయ పార్టీలకంటే కూడా కొన్నిస్థానాల్లో నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2014లో పోలైన ఓట్లలో 1.08శాతం మంది నోటా ఆప్షన్‌ను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే 2019లో 1.04శాతం మంది ఓటర్లు నోటాకే తమ ఓటు వేసారట.

జాతీయ పార్టీలనుద్దేశించి రాసే వార్తల్లో సైతం నోటాతోనే పోటీ పడుతున్నాయంటూ సెటైర్లు కూడా సోషల్‌ మీడియాలో జోరెత్తిపోతుంటాయి. పొత్తులతో పోటీ చేసినప్పుడు పడే ఓట్లు ఉమ్మట్లో కొట్టుకుపోతుంటాయి. అయితే ఎవరికి వారు స్వతంత్రంగా పోటీ చేసినప్పుడే జాతీయ పార్టీలకు తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయంటున్నారు. ఇదే క్రమంలో దేశంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కన్పించడంలో జాతీయ పార్టీల అభ్యర్ధులను కలవరపరుస్తోందంటున్నారు.

పోటీ చేసిన అభ్యర్ధులకంటే చివరాకర్న నోటాను పెట్టినప్పటికీ, పలువురు ఓటర్లు ఎంచుకుని మరీ నోటాను నొక్కేస్తుండడం ఆయా అభ్యర్ధుల మనోసై్థ్యర్యాన్ని దెబ్బతీసేస్తుందని చెప్పక తప్పదు. ఎన్నికల్లో హడావిడిగా ఎంట్రీ ఇచ్చి, మీడియా, సోషల్‌ మీడియాలో అదరగొట్టేసిన పలువురు అభ్యర్ధులకు పడిన ఓట్లు సైతం నోటాకంటే తక్కువగానే ఉంటున్నట్లు తేలింది. తద్వారా అనవసరపు హంగు ఆర్భాటాలతో తమను ఆకట్టుకోలేరని ఓటర్లు చెప్పకనే ‘నోటా’తో చెప్పేస్తున్నారన్నమాట.

ఇప్పుడు ఏపీలో కూడా తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలకు త్వరలోనే తెరలేవనుంది. ఈ నేపథ్యంలో అక్కడి ఓటర్లు తమ పరువును ఏవిధంగా కాపాడుతారో నన్న సందేహం పలు జాతీయ పార్టీలకు ఏర్పడుతోందంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కూడా నోటాకు పాతికవేలకు పైగానే ఓట్లు పడ్డాయంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులకు ఇంతకంటే తక్కువే ఓట్లు పడ్డట్టుగుర్తు చేస్తున్నారు.