‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమాకి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి మొదటి నుంచీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ సందర్భంగా గాయపడ్డంతో షెడ్యూల్‌లో కొంత గందరగోళం ఏర్పడింది. ఎలాగోలా అన్నీ సర్దుకుని షూటింగ్ షురూ అయ్యిందనుకుంటే, కరోనా వచ్చి పడింది. షూటింగులకు ప్రస్తుతం అనుమతులు లభిస్తున్నప్పటికీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీవ్‌ు, తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభించడానికి అంత సుముఖంగా వున్నట్లు కనిపించడంలేదు. సినిమా సంగతి సరే, ముందు ‘మా యంగ్ టైగర్ స్పెషల్ వీడియో’ ఎప్పుడు.? అనే ప్రశ్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వస్తోంది. దీనికి దర్శకుడు జక్కన్న వద్ద కూడా సరైన సమాధానం దొరకడంలేదు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే, ఓ పదిహేను రోజుల్లోగా ‘ఎన్టీఆర్ స్పెషల్’ విడుదల చేయగలమని రాజమౌళి గతంలోనే చెప్పాడు. కాగా, దసరా వరకూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా పునఃప్రారంభమయ్యే అవకాశాల్లేవని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఒకవేళ విజయదశమి తర్వాత షూటింగ్ పునఃప్రారంభమయినా, ‘యంగ్ టైగర్ స్పెషల్ వీడియో’ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలా వుంటే, కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి, త్వరలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ పనుల మీద ఫోకస్ పెట్టనున్నాడట. ఒక్కసారి రాజమౌళి రంగంలోకి దిగితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సూపర్బ్ స్పీడ్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది.