Idream media
Idream media
వింత నిర్ణయాలు తీసుకోవడంలో నార్త్ కొరియా అధ్యక్షుడు-కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటికే చాలాసార్లు వార్తల్లో నిలిచారు. ఒక్కోసారి నవ్వు తెప్పించినా.. కొన్ని సార్లు ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. నియంత పోకడలకు నిదర్శనంగా కొందరు ఆయనను వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేశారు.
ఇంతకీ ఏం చేశారంటే..
కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి నేటికి 10 సంవత్సరాలు పూర్తవుతోంది. దేశమంతా 11 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ మీడియాలో ప్రకటన జారీ చేశారు. ఈ 11 రోజులూ ప్రజలెవ్వరూ మద్యం సేవించకూడదు. నవ్వకూడదు, వేడుకల్లో పాల్గొనకూడదు. మొదటి రోజు డిసెంబర్ 17న దేశ ప్రజలెవ్వరూ నిత్యావసరాలు కొనేందుకు దుకాణాలకు వెళ్లరాదు. ఈ సంతాప దినాల సమయంలో ఎవరైనా మరణిస్తే.. మృతుని కుటుంబ సభ్యులు కూడా బిగ్గరగా ఏడ్వకూడదు. పుట్టిన రోజులు జరుపుకోవడానికి అస్సలు వీలులేదు. గతేడాది సంతాప దినాల సమయంలో కూడా మద్యంపై ఆంక్షలు అక్కడ ఉండేవి. ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించి పట్టుబడిన వారికి కఠిన శిక్షల అమలు జరిగాయి. శిక్షలకు గురైన వారిలో అనేకమంది తరువాత కనపడకుండా పోయారు. కిమ్ తాత కిమ్2 సంగ్ మరణించిన జులై 8న కూడా అన్ని వేడుకలపై నిషేధం.
తండ్రి కూడా తక్కువ వాడేం కాదట..
1994 నుంచీ 2011 వరకూ పాలించిన ప్రస్తుత అధినేత కిమ్ తండ్రి దివంగత కిమ్ జోంగ్ ఇల్ కూడా అత్యంత క్రూరుడు. తన నియంతృత్వ వైఖరితో ప్రజలకు స్వేచ్ఛలేకుండా చేసిన ఇల్.. ఇతని మూడో కుమారుడే ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్. తండ్రి వర్దంతి రోజున ప్రతి ఏటా 10 రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య 11 రోజులకు పెంపును ప్రకటించాడు. కిమ్ కుటుంబ పాలనలోని ఉత్తర కొరియా ప్రజలకు ఆంక్షలు కొత్తేం కాదు. దేశంలో కరవు తాండవిస్తుండటంతో సరిగ్గా తిండితినే పరిస్థితి లేదు. ఆహార కొరత నెలకొనడంతో కొద్ది నెలల క్రితం కిమ్ చేసిన ప్రకటనపై ప్రపంచం ముక్కున వేలేసుకుంది. కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుఫానులు కారణంగా ఆ దేశంలో ఆహార లభ్యత తగ్గి, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమయంలో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్ పిలుపునిచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
నియంతృత్వ నిర్ణయాల్లో కొన్ని..
దేశంలో ఇంటర్నెట్ ఉండదు, అందుబాటులో మూడే మూడు టీవీ చానెళ్లు అవీ ప్రభుత్వానివే. ఫోన్లు ఉపయోగించకూడదు, అక్కడి పేదలను ఫొటోలు తీయకూడదు. పేరుకు ఆరు రోజులు పనిదినాలు, కానీ సెలవు రోజు కూడా వాలంటరీగా పని. ఎవరూ బైబిల్ చదవ కూడదు, ఎవరి వద్దనైనా బైబిల్ కనిపిస్తే చావే. ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది, రేడియో ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలి, ఆపితే.. శిక్ష తప్పదు. జీన్స్ దుస్తులు ఇక్కడ నిషేధం, ఇళ్లు బూడిద రంగులోనే ఉండాలి. కిమ్ పూర్వీకులు, నాయకుల ఫొటోలే ఇంటి బయట ఉండాలి. మగవాళ్లంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్‌నే అనుకరించాలి.