iDreamPost
android-app
ios-app

ఆ ఒలింపిక్ పతకాలు భారత దేశానివో బ్రిటన్ దేశానివో ఇప్పటికీ స్పష్టత లేదు

ఆ ఒలింపిక్ పతకాలు భారత దేశానివో బ్రిటన్ దేశానివో ఇప్పటికీ స్పష్టత లేదు

ఒలింపిక్స్ లో భారతదేశం హవా హాకీలో 1928లో స్వర్ణపతకంతో మొదలై 1932,1936,1948,1952,1956,1964,1980 ఒలింపిక్స్ లో ఎనిమిది స్వర్ణపతకాలు గెలిచి రికార్డు సృష్టించింది. అయితే వ్యక్తిగత క్రీడల్లో మాత్రం 1952 హెల్సింకి ఒలింపిక్స్ వరకు భారతదేశానికి పతకం దక్కలేదు. ఆ క్రీడల్లో కే. డి. జాదవ్ కుస్తీ పోటీల్లో బాంటమ్ వెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. జాదవ్ స్వతంత్ర భారత దేశపు మొదటి ఒలింపిక్స్ పతక విజేతగా రికార్డు పుస్తకాలకెక్కాడు. స్వతంత్ర భారత దేశపు అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం నార్మన్ ప్రిచ్ఛార్డ్.

రెండవ ఒలింపిక్స్ లో రెండు పతకాలు

1900 సంవత్సరంలో పారిస్ నగరంలో జరిగిన రెండవ ఒలింపిక్స్ లో నార్మన్ ప్రిచ్ఛార్డ్ రెండు రజత పతకాలు గెలిచాడు. 200 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల హర్డిల్స్ లో అతడు ఈ పతకాలు గెలిచాడు. అయితే ఈ పతకాలు అతడు ఏ దేశం తరపున గెలిచాడు అన్న దానిలో గందరగోళం ఉంది.

అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నార్మన్ భారతదేశం తరఫున పాల్గొన్నట్టు పతకాల జాబితాలో చూపించింది. మొత్తం ఇరవై నాలుగు దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇరవై ఒక్క దేశాలకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధిస్తే నార్మన్ ప్రిచ్ఛార్డ్ తన రెండు వెండి పతకాలతో భారతదేశాన్ని పద్దెనిమిదో స్థానంలో నిలిపినట్టు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం రికార్డు పుస్తకాలు చూపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ అధ్లైటిక్ సంఘం రికార్డులు మాత్రం నార్మన్ బ్రిటన్ దేశానికి చెందిన అమెచ్యూర్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో పాల్గొని బ్రిటన్ తరఫున ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొని పతకాలు గెలిచినట్టు చూపిస్తున్నాయి.

పుట్టింది, పెరిగింది బెంగాల్ లోనే

నార్మన్ ప్రిచ్ఛార్డ్ బ్రిటిష్ దంపతులకు 1877లో కలకత్తాలో జన్మించి, సెయింట్ జేవియెర్స్ కళాశాలలో విద్యనభ్యసించాడు. కళాశాల స్థాయిలోనే అధ్లైటిక్స్ లో, ఫుట్‌బాల్ లో విశేషమైన ప్రతిభ కనబరచాడు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగిన చాలా అధ్లైటిక్స్ పోటీల్లో నెగ్గడమే కాకుండా, భారత దేశంలో జరిగిన ఫుట్‌బాల్ పోటీల్లో మొదటి హాట్రిక్ గోల్స్ సాధించిన రికార్డు కూడా నెలకొల్పాడు.

1900 ఒలింపిక్స్ లో మొత్తం అయిదు పోటీల్లో పాల్గొని రెండు పతకాలు సాధించాడు. 110 మీటర్ల హర్డిల్స్ లో ఫైనల్స్ చేరుకుని, పతకం తధ్యం అన్నట్లు ముందు వరుసలో పరుగెడుతుందగా ఒక హర్డిల్ దాటడంలో అడుగు తడబడి కింద పడటం వలన అందులో పతకం కోల్పోయాడు. అరవై మీటర్లు, వంద మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్ చేరుకోలేకపోయాడు.

ఒలింపిక్స్ పతకం నెగ్గిన మొదటి ఆసియా క్రీడాకారుడు

నార్మన్ ప్రిచ్ఛార్డ్ భారతదేశం తరఫునే కాకుండా ఆసియా ఖండం నుంచే ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి క్రీడాకారుడుగా కూడా ఒలింపిక్ సంఘం రికార్డులకెక్కాడు. తర్వాత 1920 ఏంట్వర్ప్ ఒలింపిక్స్ వరకూ మరో ఆసియా క్రీడాకారుడు ఒలింపిక్స్ పతకం గెలవలేదు.

1970 వరకూ ఎవరికీ తెలియదు

అయితే నార్మన్ ప్రిచ్ఛార్డ్ గురించి 1970లో శయదేందు సన్యాల్ అనే రచయిత తన ఒలింపిక్ గేమ్స్ అండ్ ఇండియా పుస్తకంలో రాసేవరకూ ఎవరికీ తెలియదు. శరదేందు తన పుస్తకంలో నార్మన్ పేరు రాసి వదిలేస్తే, అతని గురించి పరిశోధన చేసి అతని పేరు భారతదేశంలో అందరికీ పరిచయం చేశాడు డేవిడ్ వల్లాచిన్స్కీ 1996లో తన పుస్తకం కంప్లీట్ బుక్ ఆఫ్ ఒలింపిక్స్ ద్వారా. ఈ పుస్తకంలో నార్మన్ ని భారతీయుడు గానే రచయిత పరిచయం చేశాడు.

అప్పుడు భారతదేశంలో, ఇంగ్లాండులో క్రీడారచయితలు మేలుకుని నార్మన్ ప్రిచ్ఛార్డ్ మావాడంటే మావాడని తమ వాదనకు సాక్ష్యాలు వెతికే పనిలో పడ్డారు. నార్మన్ బ్రిటిష్ దంపతులకు జన్మించినా బాల్యం, యవ్వనం భారతదేశంలో గడిపి పరుగులో శిక్షణ పొంది, దేశవాళీ పోటీల్లో పాల్గొన్నాడు పైపెచ్చు 1900 నాటికి బెంగాల్ ప్రెసిడెన్సీ అధ్లైటిక్ క్లబ్ లో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి మావాడే అని భారతీయులు , అదే సమయంలో లండన్ అధ్లైటిక్ క్లబ్ లో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి మావాడే అని బ్రిటిష్ వారు తమ వాదనకు సాక్ష్యాలు బయటకు తీశారు.

ఈ సందర్భంగా భారతదేశంలో పుట్టి, ఇంగ్లాండుకు వెళ్ళి, అక్కడ క్రికెట్ నేర్చుకుని, ఆ దేశం తరఫున క్రికెట్ ఆడిన రంజిత్ సింగ్,దులీప్ సింగ్ లను భారతీయులు గుర్తు చేసి, అదే లాజిక్ ప్రకారం నార్మన్ ప్రిచ్ఛార్డ్ భారతీయుడే అని వాదిస్తున్నారు. ఎవరేమన్నా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మాత్రం తన రికార్డుల్లో నార్మన్ ప్రిచ్ఛార్డ్ భారతీయుడిగా, అతను సాధించిన రెండు పతకాలు భారతదేశానికి చెందినవిగా చూపిస్తూ ఉంది.

హాలీవుడ్ లో హీరోగా

ఒలింపిక్స్ తరువాత కూడా కొన్ని రోజులు బెంగాల్ తరఫున అధ్లైటిక్స్ లో, ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నాడు నార్మన్ ప్రిచ్ఛార్డ్. 1900-1902 మధ్య కాలంలో బెంగాల్ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శిగా కూడా పని చేశాడు. 1905లో ఇంగ్లాండు వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ తీసుకొని, ఆ తర్వాత అమెరికా వెళ్ళి నార్మన్ ట్రెవర్ గా పేరు మార్చుకొని 24 మూకీ సినిమాల్లో నాయకుడిగా నటించాడు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా అక్టోబర్ 30,1929న లాస్ ఏంజిల్స్ లో మరణించాడు.