Idream media
Idream media
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై గళమెత్తిన కేసీఆర్‌కు పలువురు బీజేపీయేతర పక్షాల నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. దీంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ఈ నెల 20న ముంబయికి వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. ఆ తరువాత బెంగళూరుకు వెళ్లనున్నట్లు, మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడను కలుసుకోనున్నట్లు, ఆపై తమిళనాడుకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ‘బీజేపీ ముక్త్ భారత్’ కోసం పోరాటం చేయాలంటూ పిలుపునిచ్చిన కేసీఆర్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలను పాలిస్తున్న విపక్ష పార్టీ నేతలంతా ఏకమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా సమరశంఖం పూరించబోతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే వీరు పూర్తి స్థాయిలో కూటమిగా ఏర్పడతారా, దేశ రాజకీయాల దిశను మారుస్తారా అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేమంటున్నారు. కానీ, ఏదో ఒక అలజడి మాత్రం చోటుచేసుకోబోతోందని అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వతీరును కేసీఆర్ ఎప్పటినుంచో తప్పుబడుతున్నారు. ఇటీవల కమలం పార్టీకి వ్యతిరేకంగా మరింత స్వరం పెంచి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతిని బయటపెడతానని, సర్జికల్ స్ట్రయిక్స్‌కు సాక్ష్యం చూపించాలంటూ ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, బీజేపీయేతర రాష్ట్రాలకు న్యాయపరమైన నిధులను కేటాయించడం లేదని ఆరోపించారు.
దేశాన్ని సరైన దిశలో పాలించడం లేదని, అందుకే బీజేపీ ముక్త్ భారత్‌కు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు మొదటినుంచీ కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ.. గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై నిరసన తెలుపుతున్న కేసీఆర్‌ను, తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందిస్తూ ఆమె ట్వీట్ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వెళ్లగక్కుతున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే బుధవారం కేసీఆర్‌కు ఫోన్ చేసినట్లు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకునేందుకు రావాలని ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ‘‘కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్పూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం. మిమ్మల్ని ముంబయికి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో భవిష్యత్యు కార్యాచరణపై చర్చించుకుందాం’’ అని కేసీఆర్‌తో ఉద్ధవ్ ఠాక్రే అన్నట్లు సీఎంవో పేర్కొంది.