Krishna Kowshik
Krishna Kowshik
ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశంలో కూడా టెక్ ఉద్యోగుల జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. గత కొన్ని నెలలుగా టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను ఇంటికి పంపిచేస్తున్నాయి. ఆర్థిక మాంద్యంతో పాటు డిమాండ్ లేకపోవడం, పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు.. వీరి ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. దేశంలో టాప్ ఐటీ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ నాలుగు కంపెనీలు.. గత మూడు నెలల కాలంలో 21, 213 మంది ఉద్యోగులను లేఆఫ్స్ చేశాయి. అంతక ముందే మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి సంస్థలు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
ఇవే కాకుండా అనేక చిన్నా, పెద్ద సాప్ట్ వేర్ సంస్థలు సైతం ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి. ఇవే కాదూ నాన్ ఐటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు రాం రాం పలుకుతున్నాయి. ఇప్పడు ఇదే అనుసరించింది ప్రముఖ టెలి కమ్యూనికేషన్ సంస్థ నోకియా. టెక్నాలజీ రంగంలో ఉన్న సమస్యలతో పాటు.. ఆర్థిక మాంద్యం, బిజినెస్ లేకపోవడం వంటి కారణాలతో నోకియా సంస్థ.. తన ఉద్యోగులకు లేఆఫ్ చేస్తోంది. సేల్స్ భారీగా పడిపోవడంతో ఉద్యోగులను ఇంటికి పోవాలని చెబుతోంది. సుమారు 14 వేల మంది ఉద్యోగులను తొలగించింది నోకియా. ప్రస్తుతం నోకియా కంపెనీలో 86 వేల మంది ఉద్యోగులు ఉండగా.. 14 వేలు తొలగించడంతో.. ఆ సంఖ్య 72 వేలకు చేరింది.
కంపెనీని నష్టాల నుండి గట్టెక్కించేందుకు ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది నోకియా. తొలగించిన ఉద్యోగులు మొత్తం ఐటి నిపుణులే కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2026 నాటికి 14 శాతం నిర్వహణ లాభాలను ఆర్జించే లక్ష్యంతో నోకియా పలు చర్యలు చేపడుతోంది. 2024లో 400 మిలియన్ల యూరోలు, 2025లో 300 మిలియన్ల యూరోల మేరకు ఖర్చును తగ్గించుకోవాలని చూస్తున్నట్లు నోకియా పేర్కొంది. మూడో త్రైమాసికంలో అమ్మకాలు తగ్గినప్పటికీ.. మళ్లీ పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ లెక్క ప్రకారం.. ఇంకా ఎంత మంది ఐటి ఉద్యోగులు ఇంటి బాట పడతారో. ఐటి ఉద్యోగులను తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.