iDreamPost
android-app
ios-app

విశాఖకు వచ్చే ముప్పేమీ లేదు

  • Published Aug 13, 2021 | 5:51 AM Updated Updated Aug 13, 2021 | 5:51 AM
విశాఖకు వచ్చే ముప్పేమీ లేదు

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినప్పటి నుంచీ దాన్ని అడ్డుకునేందుకు అనేకమంది అనేక రూపాల్లో ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా, న్యాయవ్యవస్థ ద్వారా, వాతావరణ పరంగా, పరిశ్రమల పరంగా.. ఇలా ఏ ఒక్క అవకాశాన్నీ వదలడంలేదు. ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని చిలవలు పలవలు చేసి రాజధానికి విశాఖ పనికి రాదని ప్రచారం చేస్తున్నారు. గత మూడు రోజులుగా మళ్లీ అటువంటి ప్రచారమే సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక వివరాలను విశాఖపై తాజా దుష్ప్రచారానికి వాడేసుకుంటున్నారు. ఆ నివేదిక ప్రకారం మరో 80 ఏళ్లలో విశాఖ నగరం సముద్రంలో మునిగిపోతుందని.. అందువల్ల ఆ నగరాన్ని రాజధాని చేయడం సమంజసం కాదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మన దేశానికి చెందిన వాతావరణ నిపుణులు, సముద్ర శాస్త్రవేత్తలు ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. భౌగోళికంగా విశాఖకు ఉన్న రక్షణ కవచం ఆ నగరానికి ఎటువంటి ముప్పు రానివ్వదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ నాసా నివేదికలో ఏం పేర్కొన్నారు.. మన నిపుణులు ఏం చెబుతున్నారో పరిశీలిస్తే..

దేశంలో 12 నగరాలకు ముప్పు

ప్రపంచంలో సముద్ర మట్టాల పెరుగుదలపై నాసాకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) అధ్యయనం చేసి ఒక నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న భూతాపం, కాలుష్యం, హిమానీ నదాలు కరిగిపోతుండటం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. 2100 సంవత్సరం నాటికి ప్రపంచంలో సాగర తీరాల్లో ఉన్న అనేక నగరాలు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. భారతదేశంలోని 12 తీరప్రాంత నగరాలను ఈ జాబితాలో చేర్చారు. ముంబై, చెన్నై, కొచ్చి తదితర నగరాలతోపాటు విశాఖ కూడా వీటిలో ఉంది. దీన్ని ఉటంకిస్తూ విశాఖను రాజధాని చేస్తే ప్రమాదమన్న వాదనలు మొదలయ్యాయి.

Also Read : వెంకయ్య నాయుడు కన్నీళ్లు పెట్టుకోవటం ఎందుకు?

అత్యంత సురక్షితం

మన నిపుణులు శాస్త్రవేత్తలు ఈ వాదనలను ఖండిస్తున్నారు. నాసా నివేదికలో పేర్కొన్న అంశాలు ఒక అంచనా మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, మంచు కొండలు కరగడం, సముద్ర మట్టాల నెమ్మదిగా పెరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని.. బ్రాడ్ వ్యూలో అంచనా వేశారని అంటున్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, వాతావరణ మార్పులను బట్టి ప్రాంతానికి ప్రాంతానికీ మధ్య తేడాలు ఉంటాయన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటే విశాఖ నగరం అత్యంత సురక్షితమని చెప్పవచ్చంటున్నారు.

తూర్పు కనుమలే రక్షణ కవచం

విశాఖ నగరం భౌగోళికంగా సురక్షిత జోన్లో ఉందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రాంతీయ అధిపతి జి.పి.ఎస్.మూర్తి వెల్లడించారు. డాల్ఫిన్ నోస్ గా పిలిచే తూర్పు కనుమల శ్రేణి సముద్రానికి అడ్డుగా ఉండి నగరానికి రక్షణ కల్పిస్తున్నాయని, అందువల్ల విశాఖ మునిగిపోయే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఒక చిన్న ఉప్పెన సైతం చెన్నై వంటి నగరాలను ముంచెత్తగలదు. కానీ సునామీలు సైతం విశాఖను ఏమీ చేయలేవన్నారు. 2004లో సంభవించిన సునామీ అనుభవాలే దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. విశాఖలో సముద్ర జలాలు కనీసం బీచ్ రోడ్డును కూడా చేరలేవన్నారు.

రిటైర్డ్ ప్రొఫెసర్, ఓషనోగ్రఫీ విభాగం అధిపతి పి.కె.వి.ఎస్.ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ పదేళ్ల క్రితమే తమ విభాగం భారత తీరాల్లో సముద్ర మట్టాల పెరుగుదలపై అధ్యయనం నిర్వహించిందన్నారు. విశాఖ వద్ద సముద్ర మట్టం ఏడాదికి 0.4 మిల్లీమీటర్లు మాత్రమే పెరుగుతున్నట్లు గుర్తించామని చెప్పారు. అదే సమయంలో సముద్రపు ఒడ్డు ప్రాంతం పెరిగిందని చెప్పారు. నీటిమట్టం పెరుగుదల క్రమంగా ఉన్నప్పటికీ.. పలు కారణాల వల్ల భవిష్యత్తులో అది మారవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ నీటిమట్టం పెరిగినా సముద్రమట్టానికి సుమారు ఐదు అడుగుల ఎత్తులో ఉన్న విశాఖ మునిగిపోయే అవకాశం లేదని ప్రసాద్ స్పష్టం చేశారు. నాసా అంచనా ప్రకారం చూసినా 80 ఏళ్ల తర్వాత విశాఖ వద్ద పెరిగే సముద్ర మట్టం 1.79 అడుగులే కావడం గమనార్హమని చెప్పారు.

Also Read : జల వివాదంపై చిత్రంగా తెలంగాణ తీరు..!