iDreamPost
iDreamPost
తెలుగుదేశం ఎత్తులు ఫలించడం లేదు. ఆపార్టీ నేతలు చేస్తున్న ప్రచారం చివరకు బెడిసికొడుతోంది. ఇప్పటికే అనేక విషయాల్లో అరచిగీపెట్టిన టీడీపీ నేతల తీరు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. టీడీపీ చెబుతున్న దానికి వాస్తవం విరుద్ధంగా ఉండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా మటన్ మార్టుల విషయంలో మరోసారి టీడీపీ దుమారం రేపినా అధికార పక్షం వైఖరితో గాలితీసేసినట్టయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లోనే గాకుండా నిజానికి తెలంగాణా సహా అనేక రాష్ట్రాల్లో మాంసం, చేపల విక్రయం ద్వారా స్థానికుల ఉపాధి కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణాలో చేపల విక్రయాలు పెరగడమే దానికి నిదర్శనం. ప్రభుత్వం వివిధ కార్పోరేషన్ల ద్వారా గొర్రెలు పంపిణీ చేసిన నేపథ్యంలో వాటి మాంసం విక్రయాలకు కూడా ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి, యువతను సిద్ధం చేసిన తీరు తెలంగాణాలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏపీలో అలాంటి ఆలోచన చేయడమే నేరమన్నట్టుగా టీడీపీ విరుచుకుపడింది. మాంసం విక్రయించి, జీవనం సాగించడం నేరమన్నట్టుగా వ్యాఖ్యానించింది. చివరకు మద్యం, మటన్ అమ్మకాలకు ముడిపెట్టి నానా రచ్చ చేసింది.
Also Read : టీడీపీ అనుకున్నదొకటి.. జరిగింది మరొకటి..!
వాస్తవానికి ఏపీలో మద్యం దుకాణాలు ప్రభుత్వం పరం చేసిన మూలంగానే బెల్ట్ షాపులు అరికట్టారు. మద్యం విక్రయం తగ్గించారు. మద్యం సేవించిన తర్వాత జరిగే నేరాలను అదుపులో ఉంచగలిగారు. ఇవన్నీ అధికారిక లెక్కలను గమనిస్తే తేటతెల్లమవుతంది. అదే సందర్భంలో మటన్ విక్రయాలకు అనుగుణంగా మార్టులు ఏర్పాటు చేసి వినియోగదారులకు, ఇటు అమ్మకందారులకు ప్రయోజనం కల్పించే ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చాయి. అయితే వాటిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ మీడియా కథనాల ఆధారంగా నిందా ప్రచారానికి టీడీపీ పూనుకుంది. చివరకు ఆశ్చర్యమేమంటే ఇంటింటికీ రేషన్ సరఫరా కోసం రంగంలోకి వచ్చిన వాహనాలను ఇటు మళ్లిస్తున్నారంటూ అబద్ధాలను కూడా టీడీపీ నేతలు వల్లించారు.
తీరా ఇప్పుడు ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాకముందే హంగామా చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఈ విషయమై ప్రభుత్వ వైఖరిని తేల్చిచెప్పారు. తమ వద్ద అలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు.
వాస్తవానికి అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న దానిని ఏపీలో తీసుకురావడడం ప్రయోజనకరమే అవుతుంది. క్షేత్రస్థాయి వరకూ సిబ్బంది అందుబాటులో ఉన్న సమయంలో ఇది మరింత మేలు చేస్తుంది. కానీ విపక్షం మాత్రం జగన్ ప్రభుత్వం ఏది చేసినా అడ్డుకోవాలనే సంకల్పంతో ఉన్న సమయంలో మటన్ మార్టుల చుట్టూ నానా యాగీ చేసి ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన తర్వాత మౌనం వహించే స్థితికి చేరింది. మటన్ మార్టులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం , ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం వినియోగించుకోవాలని చూసిన టీడీపీ , జనసేన శ్రేణులకు తాజా ప్రకటన మింగుడుపడడం లేదనే చెప్పాలి.
Also Read : స్పీడు పెంచిన టీడీపీ.. ఎంచుకున్న దారి సరైనదేనా?