Idream media
Idream media
తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల కొంత కాలంగా మళ్లీ దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ హాట్ టాపిక్ గా మారారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే అధ్యక్షురాలిగా వ్యవహరించిన శశికళ.. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాక అధ్యక్ష స్థానాన్ని కోల్పోవడం.. ఆ తర్వాత రాజకీయాలు వీడి ఆధ్యాత్మిక మార్గాన్ని పాటిస్తున్నట్టు శశికళ పేర్కొనడం తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ శశికళ యూటర్న్ తీసుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తమిళనాట పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాలు అన్నాడీఎంకేకే వ్యతిరేకంగా రావడం, పలువురు నేతల మధ్య పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో శశికళ ఎంట్రీపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
దీనికి తోడు.. నేను వస్తున్నా.. అంటూ శశికళ అన్నట్లుగా ఓ ఆడియో తమిళనాట వైరల్ అవుతోంది. దీంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ముఖ్య నాయకుడు కె పళనిస్వామి.. శశికళ వ్యవహారంపై స్పందించారు. శశికళ, ఆమె కుటుంబానికి తమ పార్టీలో చోటు లేదని.. ఇది పార్టీ వైఖరి అని ఆయన తేల్చి చెప్పేశారు. పార్టీ సమన్వయకర్త ఓ పన్నీర్‌సెల్వంతో తనకు విభేదాలున్నట్టుగా వస్తోన్న వాదనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆడియో క్లిప్‌లను లీక్ చేయడం ద్వారా పార్టీలో గందరగోళాన్ని సృష్టించే కుట్రలకు శశికళ ప్రయత్నిస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని పళనిస్వామి అన్నారు. ఎఐఎడిఎంకెపై తిరిగి పెత్తనం సాధించాలనే శశికళ ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవని ఆయన చెప్పారు.
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పళని స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 6 అసెంబ్లీ ఎన్నికలకు ముందే శశికళ స్వయంగా ఆధ్యాత్మిక బాట పడుతున్నట్టు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా పళనిస్వామి గుర్తు చేశారు. శశికళ విషయంలో అన్నాడీఎంకే ఖరిని ఇప్పటికే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి వెల్లడించారని పళనిస్వామి అన్నారు. పార్టీ స్టాండ్ లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.
ఇలాఉండగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో.. తాను మళ్లీ పార్టీ పగ్గాలు చేపడతానంటూ శశికళ వ్యాఖ్యలు చేసినట్టుగా ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ భ్రష్టు పట్టిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేనని, తానొచ్చి మళ్లీ పార్టీని గాడిన పెడతానని తన మద్దుతుదారులకు శశికళ భరోసా ఇచ్చినట్టు సదరు వార్తల సారాంశం. శశికళ మాటలుగా చెబుతోన్న ఆడియో లీకులపై ఇప్పటికే అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి తీవ్రంగా స్పందించారు. శశికళను ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
పార్టీపై పట్టుకోసం కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్నాడీఎంకే కార్యకర్తలకు, శశికళకు ఎలాంటి సంబంధం లేదన్న మునుసామి.. మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు శశికళ ఆడుతున్న డ్రామాగా దీనిని అభివర్ణించారు. తమ పార్టీలో ఎవరూ శశికళతో మాట్లాడలేదన్న ఆయన.. పార్టీని నిర్మించినది శశికళ లాంటి వారు కాదని, ఎంజీ రామచంద్రన్ పార్టీని స్థాపించినప్పటి నుంచి కార్యకర్తలే పార్టీకి వెలకట్టలేని సేవలు చేశారని ఆయన పేర్కొన్నారు. పళనిస్వామి – పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలున్నట్టు జరుగుతున్న ప్రచారం కూడా శశికళ కుట్రగా ఆయన అభివర్ణించారు.