iDreamPost
android-app
ios-app

నా ప్ర‌స్థానాన్ని ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు : కెసిఆర్

నా ప్ర‌స్థానాన్ని ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు : కెసిఆర్

అసెంబ్లీ ఎన్నిక‌లు ఇంకా మూడేళ్లు ఉన్న‌ప్ప‌టికీ.. ఆ ఎన్నిక‌ల్లో గెలుపు ల‌క్ష్యంగా తెలంగాణ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. టీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు బీజేపీతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా గ‌ట్టి పునాదుల ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీకి కాస్త ఊపు వ‌చ్చిన‌ట్లుగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్న గులాబీ బాస్ కె.చంద్ర‌శేఖ‌ర‌రావు ఇటీవ‌ల ఆయ‌న కూడా స్టైల్ మార్చారు. నిత్యం జ‌నాల్లోకి దూసుకెళ్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లు, ప‌రిశీల‌న‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ పైనా బీజేపీ, కాంగ్రెస్ లు కొద్ది కాలంగా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నాయి. గ‌ద్దె దించుతామంటూ స్టేట్ మెంట్ లు ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాటికి కౌంట‌ర్ గా కేసీఆర్ తాజా వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాలు అంద‌రికీ తెలిసిందే. అభ్య‌ర్థుల ఎంపిక మొద‌లు, వారిని గెలిపించుకునే వ‌ర‌కూ నిత్యం ఆయా నియోజ‌క‌వ‌ర్గంపై నిఘా ఉంచుతారు. ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రిని ఇందుకు ఆయ‌న నిఘా ఉంచుతారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఆ విష‌యం రుజువైంది. ఉప ఎన్నిక మాట అటుంచితే, టార్టెట్ 2024 ల‌క్ష్యంగా తెలంగాణ రాజ‌కీయాలు ఇప్ప‌టి నుంచే ఊపందుకుంటున్నాయి. దీనికి తోడు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెలిచి అనంత‌రం అసెంబ్లీపై గురి పెట్టేందుకు ఇప్ప‌టి నుంచే అన్నిపార్టీలూ క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

బండి సంజ‌య్ బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన త‌ర్వాత త‌న వ్యాఖ్య‌ల‌తో వేడి పుట్టిస్తున్నారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, వార్నింగ్ ల‌తో రాజ‌కీయ అగ్గి పుట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు బండి. రేవంత్ కూడా పీసీసీ చీఫ్ అయ్యాక వాగ్దాటి పెంచారు. సాధార‌ణంగానే మాట‌ల‌తో ఉప్పెన సృష్టించే కేసీఆర్ క‌రోనా నేపథ్యంలో రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌పై కాస్త త‌గ్గించారు. కానీ కొన్ని నెల‌లుగా మ‌రోసారి త‌న శైలిని కొన‌సాగిస్తున్నారు. ప‌దునైన మాట‌ల‌తో విపక్షాల‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ, తన ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాద‌న్నారు. మనకు అప నమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్న కేసీఆర్.. లక్ష్య శుద్ధి చిత్తశుద్ధి వాక్ శుద్ధి ఉంటే.. ఏ పని అయినా వందశాతం విజయవంతం అవుతుందని అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే.. ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నామని ఆ దిశగా ప్రయాణం సాగిస్తున్నామని ఫలితాలు కళ్లముందు కనబడుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లోనూ.. ఇదే విధమైన అభివృద్దిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ తాజా వ్యాఖ్య‌ల‌తో భ‌విష్యత్ పై స్ప‌ష్ట‌మైన ఎజెండాతో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.