Idream media
Idream media
ఇక అంతా అన్‌లాకే…
లాక్ డౌన్.. లాక్ డౌన్.. మళ్లీ లాక్ డౌన్..! దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఎక్కడ విన్నా ఇదే చర్చ. ఎవరు ఎవరెవరికి ఫోన్ చేసుకున్నా మళ్లీ లాక్ డౌన్ అంట కదా.. అన్నదే మొదటి ప్రశ్న.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు. మరోమారు లాక్ డౌన్ ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. 21 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన మోడీ బుధవారం మిగిలిన సీఎంలతో మాట్లాడారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న 15 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో చర్చించారు. కరోనా ప్రభావం ఎలా ఉంది..? కరోనా తీవ్రత పెరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడుతుండగా.. మళ్లీ లాక్ డౌన్ వార్తల అంశాన్ని ఆయన మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రజలకు స్పష్టత ఇస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై మోడీ మాట్లాడుతూ ఇక.. లాక్ డౌన్ ల దశ ముగిసిందని, అన్నింటినీ అన్ లాక్ లు చేసుకుంటూ పోవడమేనని చెప్పారు. ప్రస్తుతం అన్ లాక్ – 1 నడుస్తోందని అన్నారు. కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే.. ఇకపై మనం ఆలోచించాల్సిందని అన్ లాక్- 2 ఎలా అమలు చేయాలనే దానిపైనే అన్నారు. సీఎం కేసీఆర్ లేవనెత్తడంతో మళ్లీ లాక్ డౌన్ ఊహాగానాలకు తెరపడింది. తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ ఉండదని సీఎస్ సోమేశ్ కుమార్ గతంలోనే ప్రకటించారు.
అయితే కేసుల తీవ్రతను అడ్డుకోలేని పక్షంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రులకు వదిలేసినట్లు తెలిసింది. ఇప్పటికే మొట్ట మొదటిగా తమిళనాడు రాష్ట్రం మళ్లీ లాక్ డౌన్ విధించింది. కేసుల తీవ్రత ఎక్కువుగా ఉన్న నగరాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పాస్ ను తప్పని సరి చేసింది. తమిళనాడు లో ప్రస్తుతం 46, 504 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఇప్పటి వరకూ 479 మంది మృతి చెందారు. అలాగే.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా 64 డివిజన్లకు 42 చోట్ల కట్టుదిట్టమైన ఆంక్షలు అమలవుతున్నాయి.
లాక్ డౌన్ – 6 లేనట్లే..?
కరోనా అధిక ప్రభావిత ముఖ్యమంత్రులతో బుధవారం చర్చించిన ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ పై చేసిన ప్రకటనతో జూన్ 30 తర్వాత మొత్తం అన్నీ ప్రారంభం అవుతాయన్న సంకేతాలు వినిపించాయి. లాక్ డౌన్ 5 సడలింపుల్లో భాగంగా.. సినిమా థియేటర్లు, విద్యాలయాలు, పబ్బులు, బార్ లు, జిమ్ లు తదితర వాటికి మినహా అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు ప్రధాని మాటలను బట్టి ఇక జూన్ 30 తర్వాత దాదాపు అన్ని చోట్లా కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.