iDreamPost
iDreamPost
ఆంధ్రజ్యోతి పత్రిక హద్దులు దాటుతున్నట్టు కనిపిస్తోంది. అడ్డగోలుగా సాగుతున్నట్టు పదే పదే నిరూపితం అవుతోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంశంలో ఏకంగా నేవీని ముడిపెట్టి రాసిన రాతలు అందుకు తాజా ఉదాహరణ. అయినా ఆ పత్రిక తీరు మారడం లేదు. బహుశా ఇక మారదేమో కూడా. అలవాటు పడిన తర్వాత అర్థ సత్యాలు వల్లించకపోతే కష్టమేనేమో అన్నట్టుగా మారింది.
ఆంధ్రజ్యోతి కి గత సర్కారు కాలంలో రాజభోగం దక్కింది. కోట్లాది రూపాయల ప్రయోజనం అప్పనంగా చంద్రబాబు కల్పించారు. ఇప్పటికే కొన్ని భూకేటాయింపులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది కూడా. అయినా తనకు మేలు చేసినందుకు గానూ ప్రతిఫలంగా చంద్రబాబు పట్ల సానుకూలత చూపడంలో తప్పులేదు. కానీ అంతకుమించి పాఠకులను పక్కదారి పట్టించాలనుకోవడం అవివేకం. ఎల్లవేళలా అలా జరుగుతుందని ఆశించడం అజ్ఞానం. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనే సామాన్యులు ఇలాంటి రాతలను తోసిపుచ్చారు. కహానీలకు కాలం చెల్లిందని నిరూపించారు. అయినా వారం వారం కొత్త పలుకు అంటూ ఆ పత్రిక ఎండీ రాతలు, అవన్నీ చెత్త పలుకులు అంటూ సోషల్ మీడియా కౌంటర్లు షరామామూలే అన్నట్టుగా మారింది.
ఇప్పుడు వారం వారం చాలదన్నట్టుగా రోజూ ఓ కహానీ పట్టుకొస్తున్నారు. తాజాగా విజయవాడ నుంచి ఐటీ కంపెనీలు తరలిపోయినట్టు ఓ వార్త అల్లేశారు. ఆ వార్త చూస్తే విజయవాడ పటమటలోని ఆర్ఎస్ టవర్స్ లో పలు ఐటీ కంపెనీలు వచ్చాయట. అందులో వివో, హిటాచీ, ఐడియా, ఫ్లిఫ్ కార్ట్ కూడా ఉన్నాయని రాసేశారు. చివరకు ఫ్లిఫ్ కార్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఐటీ అనుబంధ సంస్థగా చిత్రీకరించారు. అది కూడా మూతపడిందని కథనం. అది కూడా అమరావతి రాజధాని స్థానంలో పాలన వికేంద్రీకరణ కోసం జగన్ తీసుకున్న నిర్ణయం మూలంగానే జరిగిందని వండి వార్చిన వైనం విస్మయకరంగా మారింది.
అంతటితో సరిపెట్టకుండా అమెరికా అధ్యక్షుడికి భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకి ఏపీ సీఎం జగన్ కి పిలుపు రాలేదని మరో కథనం. తెలంగాణా సీఎం కేసీఆర్ ని ఆహ్వానించి జగన్ కి రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు రాకపోవడంతో ఇలా కడుపుమంట బయటపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి దేశంలో 28 రాష్ట్రాలుంటే ఈ విందుకి కేవలం 8 మందిని మాత్రమే ఆహ్వానించారు. అది కూడా పలు ఐటీ సంస్థలకు కేంద్రాలుగా ఉన్న రాష్ట్రాల సీఎంలు. అదే సమయంలో సీనియర్ నేతలుగా ఉన్న వారిని పిలిచినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ జాబితాలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయినా దొరికిందే సందు అన్నట్టుగా కందకు లేని దురదను కత్తిపీట ప్రదర్శించింది. రాష్ట్రపతి భవన్ లో తమకున్న వెసులుబాటుని బట్టి వీలయినంతమందిని ఆహ్వానిస్తారు. ఆ లెక్కన చూస్తే బీజేపీ ముఖ్యమంత్రులను సైతం పక్కన పెట్టేశారన్నది అందరికీ తెలిసిన సత్యం. అయినా మోడీతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ జగన్ కి పిలుపురాలేదని రాసుకుని సంతృప్తి పడడం కేవలం కడుపుమంట చల్లార్చుకునే యత్నమే తప్ప పాఠకుడికి పనికొచ్చే విషయమే కాదని ఇట్టే అర్థం అవుతుంది.
ఇప్పటికే ఇలాంటి కడుపుమంటతో రగులుతున్న వారి గురించి కర్నూలు సభలో జగన్ వేసిన సెటైర్ జనం ఇంకా మరచిపోలేదు. అయినా ఆంధ్రజ్యోతి అక్కసు అంత త్వరగా చల్లారే అవకాశం కనిపించడం లేదు. పదే పదే అదే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాలో బీ గ్రేడ్ కథనాల స్థాయికి చేరుతున్న ఆ పత్రిక తీరు ఆశ్చర్యం లేకపోయినా వేగంగా పతనం అవుతున్న తీరు విస్మయం కలిగించక మానదు.