iDreamPost
android-app
ios-app

General Consent Not Required – సీబీఐకి ఇక స్పీడ్‌ బ్రేకర్లు లేనట్లేనా..?

General Consent Not Required – సీబీఐకి ఇక స్పీడ్‌ బ్రేకర్లు లేనట్లేనా..?

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఇక స్పీడ్‌ బ్రేకర్లు లేనట్టేనా..? రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో పని లేకుండా ఎక్కడైనా, ఎవరిపైన అయినా దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉండబోతోందా..? జనరల్‌ కన్సెంట్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అంగీకారాలు ఇక నామమాత్రమేనా..? అంటే.. కేంద్ర ప్రభుత్వం చర్యలతో అవుననే తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై సీబీఐ దర్యాప్తు చేస్తు తీరు సరికాదని పశ్చిమ బెంగాల్‌ సుప్రింలో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌.. సీబీఐకు ఉన్న అధికారాలను తెలియజేస్తోంది.

‘‘సీబీఐ చేపట్టే దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డకోలేవు. సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇచ్చే విషయంలో రాష్ట్రాల అధికారం పరిమితమే. దేశ వ్యాప్త, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తునకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు. వేర్వేరు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న కేసుల్లోనూ అనుమతులు అవసరం లేదు.’’ కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. బెంగాల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన అనుమతుల (జనరల్‌ కన్సెంట్‌)ను ఉపసంహరించుకోవడం సరికాదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు ముందు కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌పై సీబీఐ కేసు విషయంలో.. కేంద్ర ప్రభుత్వానికి, మమతా సర్కార్‌కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్‌ సర్కార్‌.. సీబీఐకి ఇచ్చిన జనరల్‌ కన్సెంట్‌ను రద్దు చేసింది. అయినా ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై సీబీఐ దర్యాప్తు చే యడాన్ని పశ్చిమ బెంగాల్‌ తప్పుబడుతూ.. సుప్రింను ఆశ్రయించింది.

రాజకీయ ఆటలో పావుగా..

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ చుట్టూ కొన్నేళ్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. తమ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగిస్తోందని, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందనే బలమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు.. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సమయంలో.. సీబీఐ దర్యాప్తునకు నో చెప్పే ఆయా పార్టీల ప్రభుత్వాలు.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వివిధ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ డిమాండ్లు చేసే విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.

2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. 2019 ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చంద్రబాబు సర్కార్‌ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలు, అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, పోలవరం ప్రాజెక్టులో అవినీతి తదితర అంశాలపై సీబీఐ దర్యాప్తు జరుగుతుందనే ప్రచారం సాగిన నేపథ్యంలో… సీబీఐకి ఇచ్చిన జనరల్‌ కన్సెంట్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు.. ఆ తర్వాత పలు సందర్భాల్లో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై పోలీసుల మద్ధతుతోనే దాడి జరిగిందంటూ ఆరోపిస్తున్న చంద్రబాబు.. డీజీపీ పాత్రపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తుండడం విశేషం. ఏది ఏమైనా, సీబీఐ విషయంలో కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సమయాల్లో వ్యవహరిస్తున్న తీరు.. ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.

Also Read : Rule Of Law – చట్టం ముందు అందరూ సమానులే.. దటీజ్ జగన్..