iDreamPost
android-app
ios-app

స‌బ్ ఎడిట‌ర్‌గా ఉంటే ఆదాయ‌పు ప‌న్ను ఉండ‌దు

స‌బ్ ఎడిట‌ర్‌గా ఉంటే ఆదాయ‌పు ప‌న్ను ఉండ‌దు

స‌బ్ ఎడిట‌ర్ ఉద్యోగంలో ఉన్న సౌల‌భ్యం ఏమంటే , మ‌నం ఎప్ప‌టికీ ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధిలోకి రాకుండా యాజ‌మాన్యాలే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాయి. ప‌రిధి దాట‌కుండా కొంచెం కొంచెంగా జీతాలు పెంచుతాయి. 16 సంవ‌త్స‌రాలు ఆంధ్ర‌జ్యోతిలో ప‌నిచేస్తే, నాకీ ఆదాయ‌పు ప‌న్ను ఇబ్బంది ఒక్క‌సారి కూడా రాలేదు. కొంద‌రు లెక్చ‌ర‌ర్ మిత్రులు దొంగ డాక్ట‌ర్ బిల్లుల కోసం నా జ‌ర్న‌లిస్టు ప‌రిచ‌యాల‌ను వాడుకునేవాళ్లు. మ‌న‌కీ గోల , గొడ‌వ లేదు క‌దా అని సంతోష ప‌డేవాన్ని.

త‌ర్వాత సాక్షిలో చేరాను. ఒక‌రోజు మేనేజ‌ర్ వ‌చ్చి మీరు ఇన్‌క‌మ్‌టాక్స్ ప‌రిధిలో ఉన్నార‌ని బాంబు పేల్చాడు. ఆనందంతో స్పృహ త‌ప్పింది. నా ఇంటి మీద రెయిడ్స్ జ‌రిగి , కీల‌క‌మైన ప‌త్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్టు క‌ల కూడా వ‌చ్చింది.

న‌న్ను ఆనందం నుంచి బ‌య‌ట‌కి లాగి, కొన్ని ఫారాలు చేతిలో పెట్టి ఇవ్వ‌న్నీ స‌రిగా ఫిల‌ప్ చేయ‌క‌పోతే జీతంలో నుంచి క‌ట్ చేస్తార‌ని చెప్పారు. ఫారాలు నింప‌డం కంటే కోళ్ల‌ఫారం నింప‌డం మేల‌ని నా ఉద్దేశం. ఎప్పుడూ ఏదో ఒక త‌ప్పు చేసేవాన్ని. నాకు లెక్క‌లే స‌రిగా రావు, ఇక దొంగ లెక్క‌లు ఏమి రాయ‌గ‌ల‌ను? దాంతో జీతంలో కోత ప‌డేది.

సాక్షి కూడా నా ప‌ట్ల ఉదారంగానే వ్య‌వ‌హ‌రించింది. మ‌రీ ఎక్కువ టాక్స్ క‌ట్ కాకుండా త‌గు మాత్ర‌మే జీతం పెంచేది. ప్ర‌తి బ‌డ్జెట్‌లో వేత‌న జీవుల‌కు ఊర‌ట అని క్వ‌శ్చ‌న్ మార్క్‌తో వార్త వ‌చ్చేది. ఆశ‌గా ఎదురు చూస్తే మ‌రుస‌టి రోజు వేత‌న జీవుల ఆశ‌ల‌పై నీళ్లు అని వార్త‌.

ఉద్యోగం మానేసిన త‌ర్వాత ఈ గోల లేకుండా పోయింది. ఉద‌యం ఒక మిత్రుడు ఫోన్ చేసి ఆనందంగా “ఐటీ శ్లాబ్ పెంచారు తెలుసా?” అన్నాడు. పళ్లు లేనివాడికి బ‌ఠాణీలు ఇస్తే ఏం చేసుకుంటాడు.

ఇప్పుడు నేను జ‌ర్న‌లిస్టుని కాను. ఉద్యోగం లేదు కాబ‌ట్టి జీతం లేదు. జీతం లేని వాడికి ఆదాయపు ప‌న్ను ఉండ‌దు. పిప్పి ప‌న్ను ఉంటే ఉండొచ్చు.