Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, బహుళార్థక ప్రాజెక్టు అయిన పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది..?.. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత ఏపీ ప్రజల మదిలో మెదిలిన ప్రశ్న ఇది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా మారిన పోలవరం నిర్మాణ ఖర్చు 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రతి ఏడాది బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు, బడ్జెట్‌తో సంబంధం లేకుండా విడుదల చేస్తున్న సొమ్ములను గమనిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా 2022 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తికావడంపై సందేహాలు మొదలయ్యాయి. గత ఎనిమిది బడ్జెట్లకు గాను ఒక సారి వంద కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ఆర్థిక శాఖ కేటాయించింది. తాజా బడ్జెట్‌లోనూ పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు చేపట్టలేదు.
అవసరం కొండంత.. ఇచ్చేది గోరంత..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం విడుదల చేసిన నిధులను పరిశీలిస్తే.. ఖర్చు కొండత అయితే.. ఇచ్చేది గోరంతలా కనిపిస్తోంది. 2017–18 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు 55,656.87 కోట్లు అవసరం అవుతుందని కేంద్ర జలసంఘం తేల్చింది. 2014లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాక ముందు రాష్ట్ర ప్రభుత్వం 4,730.71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం 10, 741 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా.. 1,652.02 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేయాల్సి ఉంది. అంటే.. ఇంకా ప్రాజెక్టుకు 38,533 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాదికి సరాసరి రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తోంది. గడచిన మూడు ఆర్థిక ఏడాదుల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పరిశీలిస్తే.. ఈ విషయం అర్థమవుతోంది. 2018–19లో 1400 కోట్ల రూపాయలు, 2019–20లో 1,850 కోట్లు, 2020–2021లో 2234.29 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం విడుదల చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
అందుకే ఈ సమస్య..
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఈ తరహాలో సీతకన్ను వేయడానికి కారణం ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తుంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తాము నిర్మిస్తామని నెత్తికెత్తుకున్నారు. దీనికి కారణం ఏమిటో ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై చేసిన ఆరోపణల ద్వారా వెల్లడైంది. పోలవరం ప్రాజెక్టును ఏటీఎం మాదిరిగా చంద్రబాబు వాడుకుంటున్నారని నరేంద్ర మోదీ రాజమహేంద్రవరం ఎన్నికల సభలో విమర్శించడం గమనార్హం. నాడు బాబు చేసిన తప్పదాలు పోలవరం ప్రాజెక్టుకు వీడని శాపాలుగా మారాయి. ప్రస్తుతం మాదిరిగానే నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే.. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు 20 ఏళ్లు పడుతుంది. ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయల చొప్పన 38 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే.. 19 సంవత్సరాలు పడుతుంది. ఈ మొత్తం నిధులలో అధిక భాగం నిర్వాసితుల పరిహారానికి సంబంధించినవి కావడం అతిపెద్ద చిక్కుముడి. మరి నిధుల సమస్యను పోలవరం ప్రాజెక్టు ఎలా అధిగమిస్తుందో కాలమే తేల్చాలి.