Idream media
Idream media
జగన్మోహన్ రెడ్డి వేవ్ లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి అధికారం అనుభవిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. నోటి దురుసు కారణంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని, కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసు న్యాయస్థానంలో కొనసాగుతూనే ఉంది. కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. సీఐడీ విచారణకు ప్రత్యక్షంగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేలా వెసులుబాటు ఇవ్వాలన్న రఘురామకృష్ణంరాజు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అలాంటి వెసులుబాటు ఇవ్వడం సాధ్యం కాదంది. రాఘురామకృష్ణంరాజు తన పిటిషన్‌లో సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసు జారీచేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రఘురామకృష్ణంరాజు తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై సీఐడీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఈ కేసుకు ఆ సెక్షన్లు వర్తించవని చెప్పారు.ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై చేసినట్లు కాదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగమే కదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసినా అవి ఆరోపణలు, అపవాదులు అవుతాయే తప్ప దేశద్రోహం కిందకు రావని ఆదినారాయణరావు తెలిపారు.
సీఐడీ తరపున స్పెషల్ పీపీ చైతన్య వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణంరాజుపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు 110 మందికిపైగా సాక్షులను విచారించామని తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దీనిపై రాష్ట్రంలో పలుచోట్ల ధర్నాలు, నిరసనలు కూడా జరిగాయని చెప్పారు. రఘురామకృష్ణంరాజు ఈ వ్యాజ్యంలో సీఐడీ అదనపు డీజీపై దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని, వాటన్నింటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌తో సహా మిగిలిన ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ విచారణను వాయిదా వేశారు. ఈ సమయంలో ఆదినారాయణరావు స్పందిస్తూ సీఐడీ విచారణకు ఆన్‌లైన్ ద్వారా స్పందించేందుకు వెసులుబాటునివ్వాలని కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు.
Also Read : బడ్జెట్ నిరుత్సాహపరిచింది.. ఆ ఫార్ములాతో ఏపీకి అన్యాయం: ఎంపీ విజయసాయి రెడ్డి