iDreamPost
android-app
ios-app

Telangana 2023 Elections -తెలంగాణ‌లో ‘ముందస్తు’ యుద్ధం..!

Telangana 2023 Elections -తెలంగాణ‌లో ‘ముందస్తు’  యుద్ధం..!

ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2018లో ఘన విజయం సాధించారు టీఆర్ఎస్ అధినేత కె.చంద్ర‌శేఖ‌ర‌రావు. ఆ ఎన్నికల్లో 88 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం సెంచరీ మార్క్ దాటింది. కాంగ్రెస్‌ నుంచి పందొమ్మిది మంది గెలుపొందగా, ప‌న్నెండు మంది టీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు కూడా అటే వెళ్లిపోయారు.

కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చి సుమారు మూడేళ్లు కావొస్తుంది. గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో మ‌రోసారి ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఆ మేర‌కు ప్ర‌ధాన పార్టీలు హోరాహోరీగా కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నాయి. అయితే.. తాజాగా ముంద‌స్తు ఊహాగానాల‌కు చెక్ పెట్టారు కేసీఆర్‌. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌ల‌ని అన్నారు. కానీ.. బీజేపీ మాత్రం ఆయన కాద‌న్నారంటే.. ఔన‌నిలే సిద్ధంగా ఉండాలంటూ శ్రేణుల‌కు పిలుపునిస్తోంది. కాంగ్రెస్ కూడా ఆ మేర‌కు స‌న్న‌ద్ధం అవుతోంది.

తెలంగాణలో ‘ముందస్తు’ ఎన్నికలు ఉండ‌వంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. రాష్ట్రంలో ఈసారి ముందస్తు ఎన్నికలు ఉండవని అన్నారు. శాసనసభకు 2023 చివర్లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, 98కి పైగా స్థానాలను కైవసం చేసుకొని మూడోసారి అధికారం చేపడుతుందని కేసీఆర్‌ చెప్పారు. ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉందని, చేయాల్సిన పనులూ ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున అప్పటిలోగా అన్ని పనులూ పూర్తి చేసుకుందామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరిన్ని స్థానాలు గెలుచుకునేలా కష్టపడి పనిచేయాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.

Also Read : Huzurabad BJP Etela -హుజూరాబాద్ టు రాష్ట్రం : బీజేపీ ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందా.?

తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన పార్టీ పార్లమెంటరీ, శాసనసభాపక్షాల సంయుక్త సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. గత ఎన్నికలకు ముందు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే తమకు కలిగే నష్టాన్ని అంచనా వేసినందువల్లే ముందస్తుకు వెళ్లినట్లు తెలిపారు. రాజకీయంగా అప్పటి పరిస్థితుల గురించి తెలిసినందునే ఆ నిర్ణయం తీసుకున్నామని, ఈసారి ఆ అవసరం లేదన్నారు. కేంద్ర రాజకీయాల్లో మున్ముందు టీఆర్‌ఎస్‌కు చాలా ప్రాధాన్యం లభించబోతోందని, లోక్‌సభలో కీలకం కాబోతున్నామని కేసీఆర్ తెలిపారు. అందువల్ల రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలపై మరింత దృష్టి పెట్టాలని పార్టీ నేతలతో చెప్పారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లబోవడం లేదని కేసీఆర్ చెప్పడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి సెటైర్ వేశారు. కేసీఆర్ అబద్ధం తప్ప నిజం చెప్పనని ఒట్టు పెట్టుకున్న మనిషని ఎద్దేవా చేశారు. సందర్భం లేకుండా ముందస్తు ఎన్నికలు లేవని కేసీఆర్ చెప్పారంటే పక్కా ముందస్తు ప్రణాళిక ఉన్నట్లేనని అన్నారు. ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమవడం మంచిదని విజయశాంతి సూచించారు. మ‌రోవైపు కాంగ్రెస్ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల స‌న్నాహాలు చేస్తోంది. షెడ్యూలుకు ముందే ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత‌లతో పేర్కొంటున్నారు. ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వ్వాల‌ని సూచిస్తున్నారు. ఈ మేర‌కు ఇత‌ర పార్టీల్లోని కీల‌క నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు.

Also Read : రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తెరాస కీలక నాయకులు