iDreamPost
iDreamPost
అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారని. ఇంకో మూడు రోజుల్లో జూలై నెల వచ్చేస్తోంది. కానీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. చిరంజీవి టీమ్ త్వరలో ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి కొన్ని సమస్యలు చర్చించబోతున్నారని టాక్ వచ్చింది కానీ అదెప్పుడు జరుగుతుందో తెలియదు. మరోవైపు తెలంగాణలో అంతా ఓపెన్ అన్నా కూడా ఎగ్జిబిటర్లు ధైర్యం చేసి హాళ్లను తెరిచేందుకు ముందుకు రావడం లేదు. ఫస్ట్ రిలీజ్ డేట్లు ప్రకటించండి అప్పుడు రెడీ చేసుకుంటామని అంటున్నారు. కానీ రెండువైపులా చొరవ తీసుకునే వాళ్ళు మాత్రం కనిపించడం లేదు.
అసలు చిక్కంతా భయం వల్ల వచ్చింది. రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ మాల్సు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఫంక్షన్లకు ధైర్యంగా వెళ్తున్న జనం ఒక్క సినిమాలకు మాత్రమే వెనుకడుగు వేస్తారా అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. కరోనా టెన్షన్ ఎంత ఉన్నా తాము సినిమాను ఎంత ప్రేమిస్తారో తెలుగు ప్రేక్షకులు మొన్న సంక్రాంతికి క్రాక్ తో మొదలుపెట్టి మొన్నటి వకీల్ సాబ్ దాకా ఋజువు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా పరిశ్రమలో ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు కొందరు జూలైలో కూడా థియేటర్లు తెరుచుకునే ఛాన్స్ లేదని చెప్పడం బట్టి చూస్తే పరిస్థితి ఇంతే తీవ్రంగా ఉందో అర్థమవుతుంది
ఇదంతా గమనిస్తే వచ్చే నెల కరోనా థర్డ్ వేవ్ కదలికలను పరిశీలించి ఆపై నిర్ణయం తీసుకునేందుకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జూలై ఆఖరున థియేటర్లు తెరవాలి అనుకున్నా చిన్న సినిమాలతో మొదలుపెడతారు. ఆగస్ట్ 15 నుంచి భారీ చిత్రాలను ఆశించవచ్చు. బాలీవుడ్ ఆల్రెడీ ఇదే తరహా ప్లానింగ్ లో ఉంది. అది కూడా వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే సంక్రాంతి తరహాలో ప్రతిసారి అలాంటి సీజన్ ఏడాది పొడవునా దొరకదు. ఎలా చూసుకున్నా మూవీ లవర్స్ ఇంకో ముప్పై రోజులకు పైగా తమ నిరీక్షణను కొనసాగించక తప్పదు