iDreamPost
iDreamPost
ఎప్పుడో 22 ఏళ్ళ క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని కాంపౌండ్ నుంచి ప్రేమకథ ద్వారా సుమంత్ పరిచయమైనప్పుడు అతని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అది విజయం సాధించలేదు కానీ తర్వాత వచ్చిన యువకుడు మంచి పేరు తీసుకురాగా సత్యం సూపర్ హిట్ ఒక స్థానాన్ని ఇచ్చింది. ఇప్పటికీ గోదావరి టీవీలో వస్తే చూసే ప్రేక్షకులు చాలానే ఉన్నారు. గౌరీ, మహానంది లాంటి సినిమాలు బిసి సెంటర్లలో నిర్మాతలకు లాభాలు ఇచ్చినవే. ఒకప్పుడు ఫస్ట్ డే హౌస్ ఫుల్ బోర్డులు చూసిన ట్రాక్ రికార్డు ఉంది సుమంత్ కి. ఇదంతా గతం. తర్వాత సీన్ మారిపోయింది. వరస ఫ్లాపులు, వివాహ జీవితం దెబ్బేసి చాలా గ్యాప్ తీసుకునేలా చేశాయి.
కట్ చేస్తే 2017లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసిన మళ్ళీ రావాతో పర్ఫెక్ట్ కం బ్యాక్ అందుకున్న సుమంత్ సెకండ్ ఇన్నింగ్స్ ని జోరుగా నడిపిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ జరిగింది వేరు. గౌతమ్ రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే రేంజ్ కి చేరుకోగా సుమంత్ రివర్స్ గేర్ లో వెళ్తున్నారు. సుబ్రమణ్యపురం, ఇదం జగత్ లాంటివి పెద్దగా ఆడింది లేదు. కపటధారి మరీ దారుణం. థియేటర్ల రెంట్లు కూడా చాలా చోట్ల రాలేదు. అయినా కూడా నిర్మాతలు ముందుకు వస్తూనే ఉన్నారు. మళ్ళీ మొదలైంది, అనగనగా ఒక రౌడీ షూటింగులు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీలతో సిద్ధంగా ఉన్నాయి. కానీ ఎప్పుడు విడుదల చేయలో మాత్రం నిర్మాతలకు అంతుచిక్కడం లేదు.
ఇవి కాకుండా నిన్న అహం రీబూట్ అనే మరో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఇది కూడా బడ్జెట్ లో తీసేదే. పోనీ సుమంత్ తో తీసినవి ఓటిటికైనా ఇస్తున్నారా అంటే అక్కడా సరైన డీల్స్ రావడం లేదట. హాల్ దాకా వచ్చి సుమంత్ సినిమా చూడాలి అంటే కంటెంట్ చాలా బలంగా ఉండాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ జరుగుతున్నది వేరు. అందుకే కనీస ఓపెనింగ్స్ కూడా దక్కడం లేదు. మళ్ళీ రావా సైతం టాక్ బాగా స్ప్రెడ్ అయ్యాక పబ్లిక్ లోకి వెళ్ళి హిట్టు కొట్టింది. ప్రతిసారి అలా జరగదుగా. మరి సుమంత్ చేస్తున్న ఈ ఒంటరి పోరాటం అతన్ని ఏ విజయ తీరాలకు చేరుస్తుందో ఎక్కడికి తీసుకెళ్తుందో వేచి చూడాలి
Also Read : God Father : గాడ్ ఫాదర్ కు భలే చిక్కొచ్చి పడిందే