iDreamPost
android-app
ios-app

OTT Release : థియేటర్ అనే మంకుపట్టు ఇప్పుడు లేదు

  • Published Jan 23, 2022 | 7:35 AM Updated Updated Jan 23, 2022 | 7:35 AM
OTT Release : థియేటర్ అనే మంకుపట్టు ఇప్పుడు లేదు

కరోనా లాక్ డౌన్ల వల్ల ఓటిటి బూమ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. వెంకటేష్, నాని, సూర్య, నితిన్ లాంటి స్టార్ హీరోలు సైతం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఓకే చెప్పక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి, అందరూ థియేటర్లకు వస్తున్న తరుణంలో ఒమిక్రాన్ రూపంలో వైరస్ మళ్ళీ తిరగబడింది. ఇప్పుడు చాలా చోట్ల యాభై శాతం ఆక్యుపెన్సీలు నడుస్తున్నాయి. వీటిని రేపో మాపో సడలిస్తారు కానీ హాలు దాకా సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల శాతం మీద ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే నిర్మాతలు విడుదల విషయంలో కేవలం థియేటర్ అనే మంకుపట్టు పట్టడం లేదు.

ఈ కారణంగానే త్వరలోనే మరో రెండు చెప్పుకోదగ్గ సినిమాలు డైరెక్ట్ ఓటిటి రూటు తీసుకుంటున్నాయి. అందులో మొదటిది సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది. జీ5 ద్వారా ఫిబ్రవరి 11న నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు సుమంత్ మార్కెట్, గత ఫ్లాపులను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది చాలా మంచి నిర్ణయం. సినిమా బాగున్నా లేకపోయినా తన కోసం థియేటర్ దాకా వచ్చే జనాలు అంతగా కనిపించడం లేదు. ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపించడంతో దీనికి మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. విడాకులు తీసుకున్నాక మళ్ళీ ప్రేమ పెళ్లి అంటూ తిరిగే ఓ మధ్యవయసు యువకుడి కథగా దీన్ని రూపొందించారు.

సురేష్ సంస్థ నిర్మించిన శాకినీ డాకిని కూడా నెట్ ఫ్లిక్స్ లో రావొచ్చని సమాచారం. కొరియన్ మూవీ మిడ్నైట్ రన్నర్స్ కు రీమేక్ గా రూపొందిన ఈ థ్రిల్లర్ లో నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ కూడా పూర్తయిపోయింది. సుధీర్ వర్మ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. నాకు బిజినెస్ ముఖ్యం తప్ప ఎవరి మీదో జాలితో నేను రిస్క్ తీసుకుని థియేటర్లలో రిలీజులు చేయలేను అని ఎప్పుడో కుండబద్దలు కొట్టిన సురేష్ బాబు శాకినీ డాకినిని ఓటిటికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవే కాకుండా సందీప్ కిషన్ మైకేల్ కు సైతం భారీ ఆఫర్లు వస్తున్నాయట. కానీ నిర్ణయం తీసుకోలేదు

Also Read : Akhanda : రెండు చోట్లా బాలయ్య బ్లాక్ బస్టర్