iDreamPost
android-app
ios-app

Malli Modalaindi : మళ్ళీ మొదలైంది రిపోర్ట్

  • Published Feb 13, 2022 | 9:22 AM Updated Updated Feb 13, 2022 | 9:22 AM
Malli Modalaindi : మళ్ళీ మొదలైంది రిపోర్ట్

ఎప్పుడో సత్యం, గోదావరి, గౌరీ, యువకుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అక్కినేని హీరో సుమంత్. తర్వాత వరస ఫ్లాపులు రావడంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కారణాలతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ రావాతో సక్సెస్ ఫుల్ కం బ్యాక్ అందుకున్నాడు కానీ దాన్ని మళ్ళీ నిలబెట్టుకోలేక పరాజయాల బాట పట్టాడు. ఆ మధ్య వచ్చిన కపటధారి మరీ దారుణంగా బోల్తా కొట్టింది. అందుకే సుమంత్ కొత్త సినిమా మళ్ళీ మొదలైంది ఈసారి థియేటర్ కు వచ్చే రిస్క్ చేయలేకపోయింది. నీట్ గా జీ5 తో ఓటిటి డీల్ చేసుకుని నేరుగా ఇళ్లకే వచ్చేసింది. మరి స్మార్ట్ స్క్రీన్ పైనైనా సుమంత్ మేజిక్ పని చేసిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం

విక్రమ్(సుమంత్)ది చెఫ్ వృత్తి. ఇతనితో పడలేక భార్య నిషా(వర్షిణి సౌందరరాజన్) విడాకులు తీసుకుంటుంది. ఇదయ్యాక విక్రమ్ ఊహించని విధంగా నిషా స్నేహితురాలు పవి(నైనా గంగూలీ)తో ప్రేమలో పడతాడు.ఇప్పుడీ రెండోసారి అతను ఎదురుకున్న సమస్యలతో విక్రమ్ తను కోరుకున్న జీవితం దక్కించుకున్నాడా లేదా అనేదే అసలు కథ. మధ్య వయసు పాత్రలో సుమంత్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయస్. చాలా ఈజ్ తో అల్లుకుపోయాడు. కొన్ని అనవసర మెరుగులు దిద్దడం వల్ల ఇబ్బంది కనిపించింది. అందరిలోకి నైనా గంగూలీకి ఎక్కువ స్పేస్ దక్కగా బాగానే పెర్ఫార్మ్ చేసింది. వర్షిణిని మైనస్ గానే చెప్పుకోవాలి. మిగిలిన ఆర్టిస్టులు ఒకే.

దర్శకుడు టిజి కీర్తి కుమార్ తీసుకున్న పాయింట్ మంచిదే కానీ రెండు గంటల పాటు ఇలాంటి డ్రామాను రన్ చేయడం చాలా రిస్క్. అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక మధ్యలో కథనం నీరసంగా నడిపించడంతో గ్రాఫ్ రెండు సార్లు పైకి అయిదుసార్లు కిందకు వెళ్లిపోయింది. రెండు ప్రేమకథలూ ఊహలకు అనుగుణంగానే సాగడం మరో మైనస్. ఎమోషనల్ కనెక్టివిటీ కూడా పెద్దగా లేకుండా పోయింది. అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు. శివ ఛాయాగ్రహణం నీట్ గా ఉంది. స్లోగా సాగే ఇలాంటి డ్రామాలు చూడాలంటే చాలా ఓపిక కావాలి. ఖాళీ సమయం తగినంత ఉండి ఇంకే ఆప్షన్ లేకపోతే మళ్ళీ మొదలైంది హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఎక్కువ ఆశించకుంటేనే సుఖం

Also Read : Sehari : సెహరి రిపోర్ట్