ఆంధ్రాలో ఆ గనిలో భారీగా బంగారు నిక్షేపాలు.. త్వరలోనే తవ్వకాలు?

కేజీఎఫ్‌ సినిమా వచ్చిన తర్వాత.. దేశవ్యాప్తంగా ఉన్న బంగారు గనుల మీద జనాలకు ఆసక్తి పెరిగింది. ప్రపంచంలో భారీ ఎత్తున్న బంగారం దిగుమతి చేసుకునే దేశం భారత్‌. ఎందుకంటే.. మన దేశంలో బంగారం చాలా తక్కువ మొత్తంలో లభ్యమవుతుంది. అంది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. అయితే ఇన్నాళ్లపాటు కేంద్ర ప్రభుత్వం.. మన దేశంలో లభిస్తోన్న విలువైన ఖనిజాల తవ్వకాల మీద పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే గతకొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం.. ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌లో బంగారు తవ్వకాలు చేపట్టేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఇందుకోసం ఏకంగా రూ.500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున బంగారం నిక్షేపాలు ఉన్నాయని కొంతకాలం క్రితమే గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహా మరికొన్ని సంస్థలు సర్వే చేసి ఎక్కడెక్కడ.. ఎంత మేర బంగారం నిల్వలు ఉన్నాయనే అంశంపై సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం.. గుడుపల్లె మండలంలోని ‘చిగుర్‌గుంట- బిసనత్తమ్’ బంగారం గని కూడా ఇందులో ఒకటిగా ఉంది. ఈ ఒక్క గనిలోనే ఏకంగా 18 లక్షల టన్నుల మేర బంగారం ఖనిజం ఉన్నట్లు అంచనా. ఇక ఒక్కో టన్ను ఖనిజం నుంచి సుమారు 5 గ్రాములకుపైనే బంగారం లభిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధరించారు.

ప్రస్తుంత ఎన్‌ఎండీసీ.. చిగుర్‌గుంట గనిలోనే తవ్వకాలు మొదలుపెట్టనుంది. ఈ బంగారం గనిలో తవ్వకాలు నిర్వహించేందుకు ఎన్‌ఎండీసీ.. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైనింగ్ లీజుకు తీసుకోవడం మిగిలి ఉంది. ఇంకా పలు అనుమతులు తీసుకోవడం సహా.. పర్యావరణ అనుమతి కూడా పొందాలి. బంగారు తవ్వకాలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ వేగంగా జరగడం కోసం కన్సల్టింగ్ సంస్థను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పనులన్నీ రెండేళ్లలో పూర్తి చేసి బంగారం గని తవ్వకాలు ప్రారంభించాలని ఎన్‌ఎండీసీ భావిస్తోంది.

ఎన్‌ఎండీసీ సంస్థ గత కొన్నేళ్లుగా.. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఏళ్లుగా ఇనుప ఖనిజాన్ని తవ్వితీస్తోంది. అలానే మధ్యప్రదేశ్‌లోని పన్నాలో కూడా వజ్రాల గని నిర్వహిస్తోంది. అయితే ఎన్‌ఎండీసీ.. ఇన్నేళ్లల్లో బంగారం తవ్వకాలపై మాత్రం ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం అందులోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతోంది. కుప్పం దగ్గర్లోనే కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో ఎన్నో ఏళ్లుగా బంగారం గనులను తవ్వుతున్నారు. ఇక రాయ్‌చుర్ సమీపంలో కర్ణాటక ప్రభుత్వానికే చెందిన హుట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ కూడా.. దేశంలోనే అతి పెద్ద బంగారం గని నిర్వహిస్తుండటం విశేషం. ఇక అన్ని అనుకూలిస్తే.. త్వరలోనే ఏపీలో కూడా బంగారం తవ్వకాలు ప్రారంభం అవుతాయి అంటున్నారు.

Show comments