iDreamPost
iDreamPost
నివర్ తుఫాన్ తమిళనాడులో తీరం దాటింది. కానీ ఏపీకి తీరని నష్టం మిగిల్చింది. ముఖ్యంగా అపారమైన పంట నష్టం సంభవించింది. ప్రాధమిక అంచనా ప్రకారమే సుమారు 29వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. చిత్తూరు నుంచి గోదావరి జిల్లాల వరకూ అన్ని చోట్లా పంట నష్టం జరిగింది. వరి, ప్రత్తి, వేరు శనగ, అపరాలు సహా వివిధ పంటలకు ఎక్కువ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. నెల్లూరు కడప జిల్లా రైతులు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి పంటలను కోల్పోయారు.
రైతుల సమస్యలపై ఏపీ క్యాబినెట్ లో ప్రత్యేకంగా చర్చించారు. తుఫాన్ తీవ్రతతో నష్టపోయిన వారందరినీ ఆదుకోవాలని నిర్ణయించారు. గడిచిన రెండు రోజుల్లో నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని అధికారులు క్యాబినెట్ కి వివరించారు. సాధారణ వర్షపాతంలో పోలిస్తే 188శాతం అధికంగా కురిసిందని వెల్లడించారు. నెల్లూరులో 2, చిత్తూరులో 5, వైయస్సార్ కడపలో 2, ప్రకాశంలో 1 మండలాల్లో అత్యధిక వర్షపాతం కురిసిందన్నారు. ప్రాధమిక సమాచారం మేరకు 664 ఇళ్లు మునిగాయని, 673 ఇళ్లు దెబ్బతిన్నాయని వివరించారు.
సీఎం ఆదేశాలతో తుఫాన్, చలిగాలుల తీవ్రత , వరదల మూలంగా ప్రాణనష్టం జరగకుండా చూడాలనే ఆదేశాలను పాటించడం ఫలితాన్నిచ్చిందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ 147 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి 10వేలమందికిపైగా తరలించినట్టు వెల్లడించారు. ప్రాథమిక వివరాల ప్రకారం 29,752 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. అందులో 16,290 హెక్టార్లలో వరి, 7362 హెక్టార్లలో మినుము, 3571 హెక్టార్లలో పత్తి, 2,529 హెక్టార్లలో ఇతర పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 10,300 హెక్టార్లు, చిత్తూరులో 10,166 హెక్టారర్లు, వైయస్సార్ కడప జిల్లాలో 4886 హెక్టార్లు, నెల్లూరులో 4400 హెక్టార్ల మేర పంట నష్టపోయినట్టు మంత్రివర్గానికి వివరించారు. వాటితో పాటుగా 1371 హెక్టార్లలో ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నాయని అన్నారు.
ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 175 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని, నాలుగు చోట్ల గండ్లు పడ్డాయని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని వెల్లడించిన అధికారులు నష్టం అంచనాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా సీఎం సహాయక చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రాణ నష్టం నివరించగలిగామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్టు తెలిపారు. భారీ తుఫాన్, అపార పంట, ఆస్తి నష్టం జరిగినా ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించగలిగామన్నారు.
భారీ వర్షాలు కారణంగా సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున తక్షణమే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 15 కల్లా పంట నష్టాన్ని నిర్ధారించాలని, డిసెంబర్ 31 నాటికి బాధితులకు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో… 80శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరాచేయాలని ఆదేశించిన సీఎం.. ఆస్తినష్టం, ప్రాణనష్టాలు ఉంటే.. మార్గదర్శకాల ప్రకారం వారికి త్వరగా పరిహారం అందించేలా చూడాలని తెలిపారు.