iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలకు మోక్షం కలుగుతోంది. ఏపీలో ప్రధాన నగరమైన విజయవాడలో ప్రధాన సమస్య ట్రాఫిక్. పేరుకు తగ్గట్టుగా అక్కడ రహదారి వ్యవస్థ లేదు. దీంతో నగరవాసులు నిత్యం ట్రాఫిక్ చట్రంలో ఇరుక్కుపోయేవారు. కేంద్ర సహకారంతో అక్కడ ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తెచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ జగన్ హయాంలోనే ప్రారంభానికి నోచుకుంది. రూ. 502 కోట్ల వ్యయంతో 2.6 కిలో మీటర్ల దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను నితిన్ గడ్కరీ వర్చువల్ గా గతంలో ప్రారంభించారు. ఇప్పుడు విజయవాడలోనే మరో ఫ్లై ఓవర్ ప్రారంభానికి నేడు (ఫిబ్రవరి 17) విచ్చేయనున్నారు.
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను సీఎం జగన్‌తో కలిసి ప్రారంభిస్తారు. అదేవిధంగా రూ.10,401 కోట్లతో నిర్మించనున్న 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు వర్చువల్ గా భూమిపూజ చేయనున్నారు . ఈ సందర్భంగా మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సమావేశంలో జగన్‌తో కలిసి ప్రసంగించనున్నారు.
ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు బెంజ్ సర్కిల్ కు చేరుకుని కొత్తగా నిర్మించిన పశ్చిమదిశ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు మరికొన్ని తీరనున్నాయి. అంతేకాకుండా.. రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై జగన్ తో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జగన్ మరిన్ని ప్రాజెక్టుల అంశాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి తనదైన శైలిలో పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో రహదారుల ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తాజా ఫ్లై ఓవర్ ప్రారంభంతో మరోసారి రుజువు కానుంది.