కరోనా వైరస్ ఆగమనంతో అన్నీ మారిపోయాయి. కొన్నాళ్ళ నుంచి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. దీంతో వారి భవిష్యత్ అంధకారంలో పడుతోందనడానికి ఎలాంటి అతిశయోక్తి కాదు. ఇదే అదునుతో పాఠశాలలు ప్రత్యక్ష క్లాసులకు స్వస్తిపలికి ఆన్ లైన్ క్లాసులతో నెట్టుకొస్తున్నాయి. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు టీవీ తెరల ముందు పాఠాలు వినడం వల్ల విద్యార్థులపై పెనుప్రభావం పడుతోంది. ఆన్‌లైన్ క్లాసులతో కెరీర్ ఎలా ఉంటుందో తెలియక కొందరు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బలవన్మరణం చెందుతున్న ఘటనలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఈ కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఆదూరి శ్రీనివాస్ మైసన్నగూడెం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు. శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు ఆదూరి ప్రమోద్‌కుమార్(20) తెలంగాణ, వరంగల్ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం EEE చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండే ప్రమోద్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్లుగా ఇంటి నుంచే ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. అయితే రెండేళ్లుగా ఇంటికే మరీ ముఖ్యంగా తన గదికే పరిమితం కావడం, ఆన్‌లైన్ క్లాసులు, మెయిల్స్, రికార్డులు పూర్తి చేయడంతో జీవితం ఒక సర్కిల్ లా మారిపోయిందంటూ ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇంట్లో తన గదిలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రమోద్. కరోనా వల్ల ఎన్‌ఐటీ తెరవడం లేదని, రెండేళ్లు ఇంటికి పరిమితం కావడం, ఆన్‌లైన్‌లోనే క్లాసులు, చదువు కావడంతో ఒత్తిడికి గురయ్యాడని తేలింది.
వీటితో పాటు మరికొన్ని విషయాలు తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాసి ప్రమోద్ ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. నిజానికి ఆన్ లైన్ పాఠాలు విద్యార్థుల బుర్రకు ఎక్కడం లేదు. వారికి డౌట్లు వస్తే తీర్చే నాథుడే లేడు. దీంతో ఈ ఆన్ లైన్ చదువులు వారికి పెనుశాపంగా మారుతున్నాయి, ఆన్ లైన్ చదువులతో తెలివైన విద్యార్థులకు లాభం కలిగినా మామూలు విద్యార్థులకు పాఠాలు అర్థంకాక ఇలా ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే అనేక అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ ఆన్ లైన్ విద్య వద్దు ఆఫ్ లైన్ విద్యే ముద్దు అంటున్నాయి. ఈ ఆన్ లైన్ వ్యవహారంతో విద్య సరిగ్గా సాగకపోవడమే కాక భవిష్యత్తులో కూడా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎక్కువగా ఆఫ్ లైన్ విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది. లేదంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.