iDreamPost
iDreamPost
గత నాలుగు నెలలుగా స్తబ్దుగా ఉన్న చిత్ర పరిశ్రమలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని అయోమయంలో ఏదైనా పెద్ద సినిమా ఓటిటిలో రాకపోతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. వచ్చిన చిన్నా చితకా చిత్రాలేవి గొప్ప ఫలితాలను సాధించలేదు కాని ఉన్నంతలో నయమనుకునే రీతిలో బాగానే స్పందన తెచ్చుకున్నాయి. కీర్తి సురేష్ పెంగ్విన్ అంతో ఇంతో ఆసక్తి క్రేజ్ రేపినా దాని భారం మొత్తం కీర్తి సురేష్ మీద పడటంతో బలహీన కథాకథనాలతో ఫ్లాప్ ముద్రే వేయించుకుంది. ఇక నెక్స్ట్ ఏ పెద్ద సినిమా వస్తుందనే దాని మీదే అందరి దృష్టి ఉంది. అదిగో పులి ఇదిగో తోక తరహాలో ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న వాటి గురించి చాలా ప్రచారాలు జరిగాయి కాని అవేవి నిజం కాలేకపోయాయి.
అయితే తాజాగా అనుష్క నిశబ్దంకు సంబంధించి గట్టి అడుగే పడినట్టు సమాచారం. నిన్నా మొన్నటి దాకా వేచి చూసిన నిర్మాతలు ఇక లాభం లేదని డిజిటల్ రిలీజ్ కు రెడీ అయిపోయారట. అనుష్క సైతం పాజిటివ్ గానే స్పందించినట్టు వినికిడి. గతంలో వచ్చిన డీల్స్ ని మరోసారి పునఃపరిశీలించి బెస్ట్ ప్రైస్ కోట్ చేసిన వాళ్ళకు ఇవ్వాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. సైకలాజికల్ హారర్ కం క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన నిశబ్దం తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హింది, కన్నడలో ఏకకాలంలో విడుదల కావాల్సి ఉంది. అందుకే ఏ స్ట్రీమింగ్ సంస్థ కొనుకున్నా ఎక్కువ మొత్తాన్నే ఆఫర్ చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ దీని విషయంలో పోటీ పడ్డాయని టాక్ వచ్చింది కాని మేకర్స్ మాత్రం ఆ సమయంలో మౌనాన్నే ఆశ్రయించారు.
రెండేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని అనుష్క చేసిన సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశబ్దంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఒకవేళ నిశబ్దం కనక అన్నట్టుగానే ఓటిటికి వెళ్తే మరికొందరు అదే బాటను అనుసరించే అవకాశం లేకపోలేదు. హిందిలో ఇప్పటికే 15 సినిమాలు వచ్చే మూడు నెలల్లో హోం మల్టీ ప్లెక్సుల పేరుతో నేరుగా ఇంటికే రాబోతున్నాయి. ఈ నేపధ్యంలో సౌత్ ఇండస్ట్రీలోనూ అలాంటి పరిణామాలు చోటు చేసుకోక తప్పదని పరిశీలకుల విశ్లేషణ. పెంగ్విన్ తరహాలోనే నిశబ్దం కూడా హీరొయిన్ ఇమేజ్ ని బేస్ చేసుకుని మార్కెట్ అవుతున్న మూవీ కావడం గమనార్హం