Idream media
Idream media
కేంద్రం రాష్ట్రానికి ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.2.70కే సరఫరా చేస్తుంటే, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.9 చొప్పున సరఫరా చేస్తోందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిర్మలమ్మా లెక్క తప్పిందని, ఆమె వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ సిఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు.
కేంద్ర మంత్రి చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. ఎన్టీపిసి కుడ్గి నుంచి యూనిట్‌కు రూ.9.84 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా.. కేంద్రం అంటగడుతోందని ఆయన వివరించారు. విద్యుత్ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేయాలని 2017లో టిడిపి సర్కార్ నిర్ణయించింది. ఆ చార్జీల్లో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు.
దేశంలో పరిశ్రమలకు యూనిట్ విద్యుత్‌ను తెలంగాణ రూ.7.60, మహారాష్ట్ర రూ.7.25, రాజస్తాన్ రూ.7.30, కర్ణాటక రూ.7.20, తమిళనాడు రూ.6.35 చొప్పున సరఫరా చేస్తున్నాయి.
తమిళనాడులో కేంద్రం అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల యూనిట్‌ను రూ.3 చొప్పున ఇస్తుండటంతో ఆ రాష్ట్రం యూనిట్‌ను రూ.6.35 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. గుజరాత్‌లో రాయితీలు తక్కువగా ఉండటం.. ఎక్కువ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉండటం వల్ల యూనిట్ రూ.5 చొప్పున పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో యూనిట్‌పై రూ.1 చొప్పున రాయితీ ఇస్తున్నాం. అంటే.. యూనిట్ విద్యుత్‌కు రూ.6.65 చొప్పున వసూలు చేస్తున్నారు.
థర్మల్ విద్యుత్ కేంద్రం పనులకు మెగావాట్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ.. టిడిపి సర్కార్ రూ.8.50 కోట్ల చొప్పున కృష్ణ పట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ వ్యవహారంలో టిడిపి సర్కార్ పెద్దలు భారీగా కమీషన్లు తిన్నారు. ఈ ఒక్క విద్యుత్ కేంద్రం వల్లే విద్యుత్ సంస్థలపై రూ.20 వేల కోట్ల అప్పు భారం పడింది.
బహిరంగ మార్కెట్‌లో సౌర, పవన విద్యుత్‌లు యూనిట్ రూ.2.. అంతకంటే తక్కువ ధరకు లభ్యమవుతోంటే.. టిడిపి సర్కార్ అధిక ధరలకు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పిపిఎ)ను కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలోనూ టిడిపి సర్కార్ పెద్దలు అవినీతికి పాల్పడ్డారు.
2014 నాటికి ఏపి జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.24,800 కోట్లు అప్పులు ఉండేవి. కానీ.. టిడిపి సర్కార్ అవినీతి, అసమర్థత.. నిర్వహణ లోపం వల్ల విద్యుత్ సంస్థల అప్పులను రూ.70 వేల కోట్లకు పెంచేసింది. అప్పుగా తెచ్చిన నిధులను టిడిపి సర్కార్ పెద్దలు తినేశారు. విభజన సమయంలో సింగరేణి కాలరీస్ తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బొగ్గు గనులను కేటాయించలేదు. దీని వల్ల బొగ్గు కొనుగోలు కోసం ఏటా అదనంగా రూ.2,500 కోట్ల మేర భారం పడుతోంది.
సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ల ద్వారా రాష్ట్రం మీదుగా సరఫరా అవుతున్న విద్యుత్‌ను వినియోగించుకున్నా వినియోగించుకోకపోయినా పక్క రాష్ట్రాలు వినియోగించుకుంటున్నా మెగావాట్‌కు రూ.5.50 లక్షల చొప్పున కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలు ట్రాన్స్‌మిషన్ చార్జీలు మెగావాట్‌కు రూ.లక్ష చెల్లిస్తున్నాయి. ఇది అధర్మమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వినియోగించుకున్న విద్యుత్‌కు మాత్రమే ట్రాన్స్‌మిషన్ చార్జీలు వసూలు చేయాలని సూచించింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది. కానీ.. ఇప్పటికీ ఆ తప్పును సరిదిద్దలేదు. దీని వల్ల ట్రాన్స్‌మిషన్ చార్జీల రూపంలోనే ఏడాదికి రూ.1,700 కోట్లు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సి వస్తోంది.
బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా.. సోలార్ బండిల్(సేవలతో కలిపి ఉత్పత్తిని విక్రయించే వ్యూహం) విద్యుత్‌ను ఎన్టీపిసి యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఏడాదికి విద్యుత్ సంస్థలపై రూ.3,500 కోట్లకుపైగా భారం పడుతోంది. టిడిపి సర్కార్ చేసిన అప్పుల్లో రూ.53 వేల కోట్లను కేంద్ర సంస్థలైన పిఎఫ్‌సి, ఆర్‌ఈసిల నుంచే చేసింది. అదీ పది శాతం వడ్డీపై. అంటే వడ్డీ రూపంలోనే ఏటా రూ.5,300 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. దీని వల్లే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉంటున్నాయి. ఈ లెక్క మరిచి రాష్ట్రం ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ వాస్తవాలు లేని విమర్శలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది.